అమరావతి వ్యవహారం అప్పుచేసి పప్పుకూడు అన్నట్లు వుంది. చంద్రన్న.. చంద్రన్న అంటూ బాబుగారు ఓట్ల కోసం పథకాల మీద పథకాలు పెడుతున్నారు. పనిలో పనిగా తెలుగుదేశం తమ్ముళ్లను పోషిస్తున్నారు. 70 రూపాయలకు పైగా భోజనం కాంట్రాక్టులు ఇచ్చి, అయిదు రూపాయలకు జనాలకు ఇస్తున్నారు. జనం బాగుంటున్నారు. కాంట్రాక్టర్లు బాగుంటున్నారు. కానీ ఖజానాకే కన్నం తప్పడంలేదు.
ఇలా అన్ని పథకాల వల్లనైతేనేం, అంచనాలు పెంచేసే పనుల వల్ల అయితేనేం ఖజానాలో ఇప్పుడు 8000 కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ లో వున్నాయట. అంటే పాపం, పనులు చేసిన వాళ్లో, లేదా డబ్బులు రావాల్సిన వాళ్లో ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులు తీరాలంటే ఖజానాకు అక్షరాలా ఎనిమిది వేల కోట్ల ఆదాయం సమకూరాలి.
ఇదిలావుంటే రాష్ట్రం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఓడి లిమిట్ దాటేసి మరీ 450 కోట్లు వాడేసిందట. ఇలా లిమిట్ దాటి వాడితే వడ్డీ చెల్లించాల్సి వుంటుంది. ఆ వడ్డీ భారం తక్కువేమీకాదు. జస్ట్ 450 కోట్లకు నెలకు ఆరుశాతం వంతున మాత్రమే. ఈ ఓవర్ డ్రాఫ్ట్ తీరాలన్నా, బిల్లులు చెల్లింపులు జరగాలన్నా, కేంద్రం ఏదో ఫథకం కింద నిధులు ఇవ్వాలి. దాన్ని దారి మళ్లించి వాడుకోవాలి.
కానీ ఇక్కడే సమస్య వస్తోంది. గతంలో ప్రభుత్వాలు ఇలాంటివి చూసీ చూడనట్లు ఊరుకునేవి. మోడీ ప్రభుత్వం లెక్కలు అడుగుతోంది. ఏ పథకానికి ఇచ్చినవి దానికే ఖర్చు చేయమంటోంది. అక్కడే కదా వచ్చింది బాబుగారికి మోడీకి అసలు గొడవ.