మూడు రోజుల క్రితం కరోనా గురించి కామెడీ చేస్తూ, భక్తులు, ఆలయాలు, గుంపులు అంటూ ట్విట్టర్ లో ఓ పోస్టింగ్ పెట్టి కాస్త ఓవర్ యాక్షన్ చేశారు నాగబాబు. ఆ పోస్టింగ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. గుడికెళ్లే భక్తుల్ని అవమానిస్తావా అంటూ హిందువులు, మిగతా మతాలవారు కూడా ఆయనకి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు. దీంతో మెగా బ్రదర్ కి ఏంచేయాలో తోచక.. పొద్దు పొద్దున్నే దాన్ని పొలిటికలైజ్ చేస్తూ కాస్త మసాలా దట్టించి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
హిందువులకు మత సామరస్యం బాగా ఎక్కువైందని, కాస్త తగ్గించుకుంటే మంచిదని కూడా ఉచిత సలహా ఇస్తున్నారు. నాస్తిక, ఆస్తిక హిందువులందరూ కలసి మతాన్ని కాపాడుకోవాలని, ఏదైనా ఉద్యమం మొదలు పెడితే తనలాంటి నాస్తిక హిందువుల సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.
అసలు నాగబాబు బాధ ఏంటంటే.. హిందూ మతం అంతరించిపోతోందట. ప్రభుత్వాలే మతాన్ని తొక్కేస్తున్నాయట. ఆదాయం కోసం హిందూ దేవాలయాలు, ఓట్ల కోసం ఇతర మతస్తులకు తాయిలాలు అంటూ చాలా విషయాలనే ప్రస్తావించారు నాగబాబు. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్. ఈ విషయాల్లో కలుగజేసుకోవాలని, హిందూ ఆలయాలకు చెందిన వేలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతా బాగానే ఉంది కానీ, ఉన్నట్టుండి నాగబాబుకి హిందూ మతంపై, హిందూ దేవాలయాల ఆస్తులపై, హిందువులపై ప్రేమ ఎందుకు పొంగుకొచ్చినట్టు. కరోనాపై పెట్టిన ట్వీట్ వికటించడంతోనే ఆయన.. దిద్దుబాటు చర్యలు ప్రారంభిచినట్టు అర్థమవుతోంది. హిందూ మతంపై ఎక్కడలేని ప్రేమ కురిపించి పనిలో పనిగా.. వైసీపీ ప్రభుత్వంపై విషం చిమ్మారు. దీనికితోడు అతడు కొనసాగుతున్న జనసేన పార్టీ ఇప్పుడు బీజేపీతో రాసుకుపూసుకు తిరుగుతోంది. నాగబాబు పోస్టుల వెనక ఈ ఎజెండా కూడా ఉండొచ్చు.
బీజేపీ, ఆర్.ఎస్.ఎస్., వి.హెచ్.పి. ని రంగంలోకి దిగాలని పిలుపిచ్చాడంటే.. తనను తాను కరడుగట్టిన హిందూత్వవాదిగా నిరూపించుకోవడానికి నాగబాబు ప్రయత్నిస్తున్నాడన్నమాట. పనిలోపనిగా జనసేనను, బీజేపీకి మరింత దగ్గర చేసే కార్యక్రమం ఇది. ప్రజల్లో ఏదైనా సీరియస్ విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని కామెడీ చేయాలనుకోవడం పెద్ద తప్పు. ఆ తప్పుని సరిదిద్దుకోడానికి ఇప్పుడు మరో తప్పు చేస్తున్నారు నాగబాబు.