ఎక్కడో ఏదో టార్గెట్ పెట్టుకుని, పైసావసూల్ అంటూ బాలయ్యతో సినిమా చేసారు. పైసా వసూలు కాలేదు కానీ, పోటీ చేసేందుకు టికెట్ దొరికింది. దాంతో రోజుకు కనీసపు ఖర్చుల కింద యాభై లక్షల వంతున, పార్టీ ఫండ్, తోటి అభ్యర్థులకు సహకారం, ఇంకా చివరి రోజున పంపిణీ అన్నీకలిసి పదుల కోట్లు ఖర్చయిపోయాయి.
ఇదంతా భవ్య.. ఆనంద్ ప్రసాద్ ముచ్చటే. నిర్మాతగా సరైన హిట్ లు లేవు దాదాపు తొంభైశాతం ఫ్లాపులే. బిల్డర్ గా, పారిశ్రామిక వేత్తగా కలిసి వచ్చిన అదృష్టం పోనీ రాజకీయాల్లో కూడా కలిసి వస్తుందేమో అనుకుంటే, అక్కడా దురదృష్టమే ఎదురయింది. శేరిలింగంపల్లి సీటులో ఓటమే పలకరించింది.
'బండ్ల'పాలయ్యాడు
మరీ ఓవర్ యాక్షన్ చేసిన మొనగాడు ఎవరు అంటే బండ్ల గణేష్. సీటు రాకపోయినా, తెల్లవారితే చాలు ఛానెళ్ల ముందు కూర్చుని తెగ బీరాలు పోయాడు. ఆఖరికి మాహాకూటమి ఓడిపోతే పీక కోసుకుంటా అంటూ అక్కరలేని సవాళ్లు విసిరాడు. ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ నిండా బండ్ల కోసం బ్లేడులు ఎదురు చూస్తున్నాయి. దీంతో బండ్ల ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు.
సినిమా జనాల భజన రెడీ
ఎన్నికల టైమ్ లో ఎందుకొచ్చిన రగడ అని సినిమా జనాలు ఎటూ పెదవి విప్పలేదు. కానీ ఫలితాలు రాగానే అర్జెంట్ గా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేసిఆర్ దగ్గరకు అనేకసార్లు అనేక వ్యక్తిగత పనులతో అనేకమంది సినిమా జనాలు వెళ్లారు. కానీ వాళ్లు కూడా ఎన్నికల టైమ్ లో గప్ చుప్ అయ్యారు. ఇదిలావుంటే మా అసోసియేషన్ అర్జెంట్ గా కెసిఆర్ ను అభినందించడం కోసం ప్రెస్ మీట్ కూడా పెట్టేసింది.