దశాబ్దాల కిందట వచ్చింది పున్నమినాగు సినిమా. మరో వారం రోజుల్లో రిలీజ్ అవ్వబోతోంది భోళాశంకర్. మరి ఈ రెండు సినిమాల మధ్య సంబంధం ఏంటి? కథాపరంగా ఈ రెండు సినిమాలకు అస్సలు పోలిక లేదు. అయినప్పటికీ ఓ చిన్న లింక్ ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కీర్తిసురేష్ బయటపెట్టింది.
ఎన్నో ఏళ్ల కిందట కీర్తిసురేష్ తల్లి మేనక, చిరంజీవితో కలిసి పున్నమినాగు సినిమాలో నటించింది. మళ్లీ ఇన్నేళ్లకు చిరంజీవి సినిమాలో మేనక కూతురు కీర్తిసురేష్ నటించింది. ఈ విషయాన్ని బయటపెట్టిన కీర్తిసురేష్.. అలా పున్నమినాగు, భోళాశంకర్ కు కనెక్షన్ ఉందని చెప్పుకొచ్చింది.
పున్నమినాగు టైమ్ లో మేనక వయసు చాలా తక్కువంట అప్పట్లో ఆమె అమాయకంగా ఉండేదట. ఆమెకు చాలా విషయాల్ని చిరంజీవి చెప్పేవారంట. చిన్న పాపకు చెప్పినట్టు అన్ని వివరించేవారంట. భోళాశంకర్ లో ఆఫర్ వచ్చిన వెంటనే తల్లిని అడిగి, చిరంజీవి గురించి చాలా విషయాలు తెలుసుకుందట కీర్తిసురేష్.
సెట్స్ లో చిరంజీవిని ఎప్పుడు కలిసినా తన తల్లి గురించి మాట్లాడుకునేవాళ్లమని,'మేనక అంత అమాయకురాలివి నువ్వు కాదంటూ' చిరంజీవి తనను ఆటపట్టించేవారని చెప్పుకొచ్చింది.
ఇక భోళాశంకర్ సినిమా చేసినన్ని రోజులు కీర్తిసురేష్ కు చిరంజీవి ఇంటి నుంచి భోజనం వచ్చేదంట. చిరంజీవి ఇంట్లో చేసే ఉలవచారు, కాకరకాయ కూర అంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో తనకు ఏం కావాలో చెప్పి మరీ చిరంజీవి ఇంటి నుంచి తెప్పించుకునేదంట కీర్తిసురేష్.
భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటించింది కీర్తిసురేష్. ఈ సినిమాలో తన పాత్ర బబ్లీగా ఉంటుందని, అందుకే చిరంజీవితో కలిసి డాన్స్ చేసే అవకాశం కూడా దక్కిందని చెప్పుకొచ్చింది.