భారతీయుడు 2 కథ లాజికల్‌గా సాధ్యమేనా!

మొదట ఏదో ప్రతిపాదన మాత్రమే అనుకున్నారు. ఇలాంటి ప్రతిపాదనలే అయితే బోలెడన్ని వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి సీక్వెల్స్‌ ప్రతిపాదనలకు అయితే కొదవే ఉండదు. వివిధ సూపర్‌ హిట్‌ సినిమాలకు సీక్వెల్స్‌ అంటూ అప్పుడప్పుడు వార్తలు…

మొదట ఏదో ప్రతిపాదన మాత్రమే అనుకున్నారు. ఇలాంటి ప్రతిపాదనలే అయితే బోలెడన్ని వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి సీక్వెల్స్‌ ప్రతిపాదనలకు అయితే కొదవే ఉండదు. వివిధ సూపర్‌ హిట్‌ సినిమాలకు సీక్వెల్స్‌ అంటూ అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే అవన్నీ ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతూ ఉంటాయి. అదేకోవన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ పార్ట్‌ కూడా నిలిచిపోతుందనే చాలామంది అనుకున్నారు. ఈ సీక్వెల్‌ ప్రతిపాదన వచ్చినప్పటికి శంకర్‌ కూడా ఫామ్‌లో లేకపోవడంతో.. ఎప్పుడో వచ్చిన భారతీయుడుకు ఇప్పుడు సీక్వెల్‌ జరిగే పనికాదని చాలామంది అనుకున్నారు.

అయితే విచిత్రంగా భారతీయుడు సీక్వెల్‌ ప్రతిపాదన దశ నుంచి పట్టాలెక్కే దశకు వచ్చింది. కమల్‌ సినిమాల్లో సీక్వెల్స్‌ తీయాలంటే బోలెడన్ని సినిమాలున్నాయి. అయితే వాటిలో వేటికీ కాకుండా ఇప్పుడు భారతీయుడుకు సీక్వెల్‌ అని అంటున్నారు. సీక్వెల్‌ అంటే.. మినిమం లాజిక్‌ ఉండాలని సగటు సినీ ప్రేక్షకుడు అనుకుంటాడు. అయితే సినిమా వాళ్లు మాత్రం అలా అనుకోవడం లేదు. బాలీవుడ్‌లో సీక్వెల్‌కు ఎప్పుడో అర్థం మారిపోయింది. అసలే మాత్రం సంబంధం లేని కథలను, ఆ కథకు ఏమాత్రం సంబంధం లేని సినిమాకు సీక్వెల్స్‌ అంటూ తెరమీదకు తీసుకురావడంతో సీక్వెల్‌కు అక్కడ అర్థం మారిపోయింది.

కొనసాగింపు అనేమాటకు విరుద్ధంగా పూర్తి భిన్నమైన కథతో వచ్చిన సినిమాలను కూడా అక్కడ ఒకదానికి ఒకటి సీక్వెల్‌ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక సౌత్‌లో మాత్రం సీక్వెల్‌ పేరుతో ఏదో ఒక కొసను జాయింట్‌ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. ఆ మధ్య కిక్‌ టూ విషయంలో అదే. ఏదో బీరకాయ పీచు సంబంధాన్ని అంటగట్టారు. ఇక సింగం సీరిస్‌ సినిమాలు హీరోహీరోయిన్‌ పాత్రలను కొనసాగిస్తూ.. సాగాయి. అవి జనాలకు బోర్‌ కొట్టేశాయి.

ఈ మధ్య వచ్చిన పందెంకోడి పార్ట్‌ టూను కూడా తొలి పార్టుతో లింకప్‌ చేయడానికి ఏవో పాట్లుపడ్డారు. అసలు సీక్వెల్‌ అని ఎందుకు చెప్పారు, వేరే సినిమా అని చెప్పి ఉంటే కొన్ని లిబర్టీస్‌ ఉండేవి కదా.. అని రివ్యూయర్లు ప్రశ్నించారు. అయితే సినిమా మేకింగ్‌ చేసే వాళ్లకు సీక్వెల్‌ అంటే.. మార్కెటింగ్‌ పరంగా కలిసి రావొచ్చు. పందెంకోడి తమిళ పార్టుతో పాటు తెలుగులోనూ హిట్‌ కాబట్టి.. సీక్వెల్‌ అంటే కాస్త ఓపెనింగ్స్‌ పెరుగుతాయనే ఆశలు ఉండవచ్చు. ఇలా సీక్వెల్‌ అనేది కథతో సంబంధం లేని ఒక మార్కెటింగ్‌ టెక్నిక్‌ అయిపోయింది.

కానీ, శంకర్‌కు మరీ అంత అవసరం లేకపోవచ్చు. శంకర్‌ – కమల్‌హాసన్‌ కాంబోలో సినిమా అంటే సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఓపెనింగ్స్‌ ఉంటాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిపీటవుతున్న కాంబినేషన్‌గా వీళ్ల సినిమా పట్ల ఆసక్తి ఉంటుంది. బడ్జెట్‌ను హద్దుల్లో పెట్టుకుని రూపొందిస్తే సినిమా మార్కెటింగ్‌ పరంగా కూడా సేఫ్‌జోన్లో ఉంటుంది. అయినా వీళ్లు సీక్వెల్‌ పేరుతోనే వస్తున్నారు. అయితే గతంలో వీళ్ల కాంబోలో సినిమా వచ్చినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే.. అసలు భారతీయుడుకు సీక్వెల్‌ అనేది లాజికల్‌గా సాధ్యమేనా అనేక. సందేహం రానే వస్తుంది!

ఆ సందేహం కమల్‌కే మొదట వచ్చిందట!
ఇప్పుడుకాదు.. భారతీయుడు సినిమా ప్రకటన వచ్చినప్పటి కథ. శంకర్‌ దర్వకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా ఇండియన్‌ పేరుతో సినిమా రూపొందుతుందని, ఏఎం రత్నం ఆ సినిమాను నిర్మిస్తాడని ప్రకటనలు చేసేశారు. అప్పటికే కథా చర్చలు జరిగాయి.. కథను పూర్తిగా కమల్‌ హాసన్‌కు వివరించారు. కమల్‌ ఓకే చెప్పేశాడు. సినిమా షూటింగ్‌ మొదలుకావడమే తరువాయి. అలాంటి సమయంలో కమల్‌కు ఆ కథ పట్ల కొన్ని కొత్త సందేహాలు వచ్చాయట. కమల్‌కు వచ్చిన డౌట్లు చాలా హేతుబద్ధంగానే ఉన్నాయి కూడా.

అవేమిటంటే.. సేనాపతి(ముసలి కమల్‌ హాసన్‌) క్యారెక్టర్‌ విషయంలో. అతడు స్వతంత్ర సమరయోధుడు. అదీ మామూలు యోధుడుకాదు.. ఏకంగా సుభాష్‌ చంద్రబోస్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నవాడు. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వాడు. స్వతంత్రం రాకముందు జైల్లో గడిపాడు. స్వతంత్రం వచ్చాకా బయటపడ్డాడు. కట్‌ చేస్తే.. దాదాపు యాభై సంవత్సరాలకు కత్తి తీస్తాడు. తెల్లదొరల మీద కత్తి దూసినవాడు, యాభై యేళ్ల తర్వాత నల్లదొరల మీద కత్తిదూస్తాడు.

ఎందుకంటే.. సమాజం లంచంతో నాశనం అయిపోయిందని. ఇదీ శంకర్‌ చెప్పిన కథ. కమల్‌కు వచ్చిన సందేహం ఏమిటంటే.. ఆ యాభై సంవత్సరాలూ సదరు పోరాట యోధుడు ఏం చేశాడు? అనేది. ఎందుకంటే.. సమాజంలో లంచం అనేది అప్పటికప్పుడు పుట్టుకు వచ్చింది కాదు. యాభై యేళ్లలో అనునిత్య లంచం ఉండింది. దేశాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చింది. ఒక వైరస్‌లా వ్యాపిస్తూ వచ్చింది. మరి అన్ని సంవత్సరాలూ సదరు భారతీయుడుకు భారతదేశంలో ఏం జరుగుతోందో తెలీదా? తనదాకా వస్తేకానీ.. లంచం తీవ్రత ఏమిటో అర్థంకాలేదా?

బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన వాడికి, నేతాజీతో కలిసి పనిచేసిన వాడికి.. అన్ని సంవత్సరాలూ దేశంలో ఏం జరుగోతోందో తెలియలేదా? అనే సందేహాలు కలిగాయట కమల్‌ హాసన్‌కు. కాబట్టి ఈ సినిమా లాజికల్‌గా తెరకెక్కించడానికి సాధ్యం అవుతుందా? అని కమల్‌ సందేహించాడట. ఈ డౌట్లను వ్యక్తపరిచి మార్పు చేర్పులు చేయడమా, లేక మొత్తానికి డ్రాప్‌ అయిపోవడమా అనే సంధిగ్ధంలో పడ్డాట కమల్‌.

వెనక్కు తగ్గని శంకర్‌..!
కమల్‌ వ్యక్తపరిచిన డౌట్లు శంకర్‌ వరకూ వెళ్లాయి కానీ.. అతడు మాత్రం తను రూపొందించిన కథ, కథనాల్లో ఎలాంటి మార్పులు చేయడానికి ఒప్పుకోలేదు. కథ అలాగే ఉంటుంది, స్క్రిప్ట్‌తో కమల్‌ వ్యక్త పరిచిన సందేహాలు కవర్‌ అయిపోతాయి.. అంటూ మార్పు చేర్పులకు శంకర్‌ గట్టిగా నో చెప్పాడు. కమల్‌ ఆ సినిమానే లైట్‌ తీసుకునే దశకు వచ్చేశాడట. అయితే.. సినిమాను అనౌన్స్‌ చేసిన నిర్మాత రత్నంకు మాత్రం గుండెల్లో రాయిపడింది.

వీళ్లలో ఎవరిని కన్వీన్స్‌ చేయాలో అర్థంకాక కమల్‌ హాసన్‌ వద్దకు వెళ్లిపోయి.. డైరెక్టుగా కాళ్లమీద పడిపోయాడట. సినిమాను ఆగిపోనివ్వవద్దని.. చేసిపెట్టాలని బతిమాలుకున్నాడట. దీంతో కమల్‌ సరేలే.. అనేశాడని తెలుస్తోంది. ఎలాగైతేనేం భారతీయుడు రూపొందింది. సంచలనం రేపింది. సూపర్‌ హిట్‌గా నిలిచిపోయింది.

భారతీయుడు ప్రభావంతో బోలెడన్ని కథలు!
ఒక ట్రెండ్‌ సెట్టర్‌ భారతీయుడు. తమిళంలో వచ్చిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లోకి కూడా అనువాదమై సంచలన విజయం సాధించింది. అది విజయం సాధించడమే కాదు.. బోలెడన్ని సినిమాలకు ఇది స్ఫూర్తిని ఇచ్చింది. సామాజిక బాధ్యతతో సినిమాలు రూపొందిచండానికి కొత్త ప్రేరణగా నిలిచింది. అంతవరకూ వచ్చిన యాంగ్రీయంగ్‌ మ్యాన్‌ ట్రెండ్‌కు భిన్నమైన దారిని చూపించింది. అవినీతి పరులను శిక్షించడం అనే ఒక్క పాయింట్‌ మీదే బహుశా కొన్ని పదుల సినిమాలు వచ్చి ఉంటాయి. వాటిల్లో కొన్ని సూపర్‌ హిట్స్‌ వచ్చాయి.

భారతీయుడు ప్రభావంతోనే తమిళ రమణ, తెలుగు ఠాగూర్‌, ఇంకా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయని చెప్పనక్కర్లేదు. అవినీతి పరులను శిక్షించడం అనే పాయింట్‌ను తీసుకుని.. స్టార్‌ హీరోలతో బోలెడన్ని సినిమాలు రూపొందించారు దర్శకులు. ఈ ట్రెండ్‌ ఒక్కమగాడు వరకూ కొనసాగింది. కొనసాగుతూ ఉంది.

భారతీయుడు టూ లాజిక్‌ ఉంటుందా?
భారతీయుడు విషయంలోనే లాజిక్‌ అడిగాడట కమల్‌ హాసన్‌. అన్నేళ్లు భారతీయుడు ఏం చేశాడు అని సందేహించాడట. అప్పుడు ఏదో అలా కానిచ్చేశారు. మరి ఇప్పుడు  కథేంటి? లాజికల్‌గా చూస్తే.. భారతీయుడు ఇంకా బతికి ఉండే అవకాశాలు లేవు. రెండు దశాబ్దాల కిందటే, అప్పటికే ముసలాడు అయిన భారతీయుడు ఇప్పటి వరకూ బతికి ఉండలేడు. బతికి ఉన్నాడు.. మళ్లీ ఇండియాకు వచ్చాడు.. అనిచూపిస్తే అంతకన్నా లాజిక్‌ లెస్‌ ఉండదు.

ఒకవేళ భారతీయుడి కొడుకులో పరివర్తన  వచ్చి హీరోగా మారాడు అని చెప్పడానికా.. అతడిని అప్పుడే చంపేశారు. కాబట్టి.. భారతీయుడు కథకు సీక్వెల్‌ అంటే.. అది చాలావరకూ లాజిక్‌ లెస్సే అవుతుంది. ఒకవేళ లాజిక్‌ను పూర్తిగా పక్కనపెడితే.. దానికి భారతీయుడు టూ అని పేరు పెట్టడమే కామెడీ అయిపోతుంది. మరి ఈ విషయాన్ని శంకర్‌ ఎలా బ్యాలెన్స్‌ చేస్తాడో చూడాల్సి ఉంది. పూర్తిగా కొత్త కథను, కొత్త పాత్రలను తీసుకొచ్చి భారతీయుడు టూ అంటాడేమో.

అవినీతి పరులను హీరో అటాక్‌ చేయడం అనే పాయింట్‌ మీద బోలెడన్ని సినిమాలు వచ్చేశాయి. మళ్లీ కథను దానిచుట్టూనే  తిప్పలేడేమో. అలాగే శివాజీ వంటి సినిమాలో కూడా ఒక సామాజిక అంశాన్ని టచ్‌ చేసిన శంకర్‌.. ఈసారి సమాజంలో నెలకొన్న మరెలాంటి పాయింట్‌ను పట్టుకుంటాడో!

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్