స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని వేడెక్కించేస్తున్నాయి. రేపో మాపో నోటిఫికేషన్ వచ్చేయనుంది. రిజర్వేషన్లు ఖరారవుతున్నాయి. రిజర్వేషన్ల కోటాని 59.85 శాతానికి పెంచాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అనుకున్నా, హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురవడంతో.. ఇంకో ఆలోచన చేయకుండా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యింది.. ఆ 50 శాతం రిజర్వేషన్లతోనే. రికార్డు సమయంలో స్థానిక ఎన్నికల్ని పూర్తి చేయాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పం.
ఇదిలా వుంటే, స్థానిక ఎన్నికల విషయమై తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోపక్క, తెలుగు తమ్ముళ్ళు మాత్రం ముందే చేతులెత్తేస్తున్నారు. ‘ఎన్నికలు పద్ధతిగా జరిగితే మాదే విజయం. కానీ, ప్రభుత్వం.. పోలీసు యంత్రాంగాన్ని అడ్డంపెట్టుకుని.. కుయుక్తితో ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రజలు ఇంకోసారి ఓడిపోవడం ఖాయం..’ అని తెలుగు తమ్ముళ్ళు చెబుతుండడాన్ని చూస్తోంటే, స్థానిక ఎన్నికల్లో ఫలితాలపై టీడీపీకి ఎంత ముందస్తు అవగాహన వుందో అర్థం చేసుకోవచ్చు.
ఎలాగూ ఓడిపోతామనే నిర్ణయానికి వచ్చేయడం వల్లే తెలుగు తమ్ముళ్ళు, ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోపక్క, 2019 ఎన్నికల్లో దెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ, ఏ గ్రామంలోనూ ఇప్పటిదాకా పుంజుకున్న పరిస్థితి కన్పించడంలేదు. పూర్తిగా టీడీపీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్ళిపోయాయి.
ఆ మాటకొస్తే, ఏ జిల్లాలో ఏ నాయకుడు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాడో తెలియని దుస్థితి అధిష్టానంలో నెలకొంది మరి.! చంద్రబాబు ఇప్పుడెవర్నీ నమ్మలేరు.. ఆ స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు దెబ్బ మీద దెబ్బ కొడుతూనే వున్నారు. ఓ పక్క, పార్టీ ముఖ్య నేతలు చేతులెత్తేయడం.. ఇంకోపక్క, నైరాశ్యంలోంచి పుట్టుకొస్తున్న బుకాయింపులు.. వెరసి, టీడీపీ తన స్థాయిని తానే తగ్గించేసుకుంటోంది.
సాధారణంగానే అధికార పార్టీకి స్థానిక ఎన్నికల్లో ఎడ్జ్ వుంటుంది. దానికి తోడు, విపక్షాలు పూర్తిగా నిర్వీర్యమైపోవడం అధికార పార్టీకి మరింతగా కలిసొచ్చే అంశం. ఇన్ని సానుకూలతలకు తోడు గత 9 నెలల్లో కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో తిరుగులేని విజయం తమకు దక్కుతుందని అధికార వైఎస్సార్సీపీ భావిస్తోంది.