అతిలోక సుంద‌రి బిడ్డ‌కు అమ్మ గుర్తొచ్చింది

అమ్మ…ఆ పిలుపే ఓ మ‌ధురం. అమ్మంటే ఓ భ‌రోసా, జీవితానికో ధైర్యం. ప్ర‌పంచంలో దేనినైనా కొన‌వ‌చ్చేమో కానీ, ఒక్క అమ్మ ప్రేమ‌ను త‌ప్ప‌. అందుకే అమ్మను క‌ల‌వ‌రించ‌ని, ప‌ల‌వ‌రించ‌ని మ‌న‌సు ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు.…

అమ్మ…ఆ పిలుపే ఓ మ‌ధురం. అమ్మంటే ఓ భ‌రోసా, జీవితానికో ధైర్యం. ప్ర‌పంచంలో దేనినైనా కొన‌వ‌చ్చేమో కానీ, ఒక్క అమ్మ ప్రేమ‌ను త‌ప్ప‌. అందుకే అమ్మను క‌ల‌వ‌రించ‌ని, ప‌ల‌వ‌రించ‌ని మ‌న‌సు ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు. ముఖ్యంగా అమ్మాయిల‌కు అమ్మ‌లేని లోటు ఎవ‌రూ పూడ్చ‌లేరు. బాలీవుడ్ న‌టి జాన్వీక‌పూర్ ఫిబ్ర‌వ‌రి 6న 24వ వ‌సంతంలోకి అడుగు పెట్టారు.

పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె త‌న అమ్మ శ్రీ‌దేవిని గుర్తు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న అపురూప సౌంద‌ర్యం, అంత‌కు మించిన న‌ట‌న‌తో యావ‌త్ దేశంపై ఆమె వేసిన ముద్ర సామాన్య‌మైంది కాదు. ఆమెను ఇష్ట‌ప‌డ‌ని సినిమా అభిమాని ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. మ‌న మ‌ధ్య శ్రీ‌దేవి భౌతికంగా ఇక లేర‌ని తెలిసిన క్ష‌ణాన యావ‌త్ భార‌తదేశ‌మంతా క‌న్నీరుమున్నీరైంది. అలాంటిది, ఆ అతిలోక సుంద‌రి ర‌క్తం పంచుకున్న బిడ్డ‌గా, ఆ త‌ల్లి జ్ఞాప‌కాల‌తో త‌డిసి ముద్ద కావ‌డంలో ఆశ్చ‌ర్యం ఏముంది?
 
త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా జాన్వీ ఓ ఇంటర్యూలో త‌ల్లితో త‌న జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకున్నారు. తన పుట్టిన రోజునాడు శ్రీదేవి  చాలా హడావుడి చేసేవారని చెప్పారు. ‘నా ప్రతి పుట్టిన రోజును మా అమ్మ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంచేవారు. ముందు రోజు రాత్రి నా రూం అంతా బెలూన్‌లతో ప్రత్యేకంగా అలంకరించి కేక్‌ కట్‌ చేయించేవారు. ఆరోజు అమ్మ.. నన్ను చాలా  గారాబం చేసేది. అయితే డాడీ(బోణి కపూర్‌) ఇప్పటికీ ప్రతి రోజు నన్ను గారాబం చేస్తారు’ అని జాన్వీ చెప్పుకొచ్చారు.

అంతేగాక మన ప్రత్యేకమైన రోజునా(పుట్టిన రోజు) ఖరీదైన బహుమతుల కంటే మనకు ఇష్టమైన వాళ్లతో గడపే సమయం చాలా విలువైందని జాన్వీ చెప్పారు. శ్రీ‌దేవి పేరు, ప్ర‌తిష్ట‌ల‌ను నిల‌బెట్టేలా జాన్వీకి త‌ల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాల‌ని పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆశీస్సులు అందిద్దాం.

ఈ విహారం పద్దతిని పాటిస్తే కరోనా సోకదు