మిథాలీరాజ్…భారత్ మహిళా క్రికెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహిళా క్రీడాకారిణి. ఇప్పుడామె చీర కట్టులో మైదానంలో దిగితే…ఎలా ఉంటుందో ఊహించుకోండి. వావ్…ఆమెలానే మిథాలీ క్రికెట్ కూడా అందంగా ఉంటుంది. చూడ చక్కని స్ట్రోక్స్‌తో ఆమె ఆలరిస్తోంది. విభిన్నమైన బ్యాటింగ్ స్టిల్స్‌తో ‘మిథాలీ అదుర్స్’ అనిపిస్తోంది.
సహజంగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలంటే జెర్సీ తప్పనిసరి. అలాంటి ఆటలో ఎలాంటి గాయం కాకుండా హెల్మెట్, గ్లోవ్స్, ప్యాడ్స్ కూడా తప్పనిసరే. కానీ, మగవాళ్లు పంచకట్టులో, మహిళా క్రికెటర్లు చీరలో క్రికెట్ ఆడటం ఎప్పుడైనా చూశారా? లేదు కదా? ఇక మీదట ఇలాంటి సమాధానం రాకుండా మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ఆ కోరిక తీరుస్తోంది.
ఒక మహిళా క్రికెటర్ మొట్టమొదటి సారి చీరలో క్రికెట్ ఆడి అందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మిథాలీ ఓ వీడియో రూపొందించి.. సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. మిథాలీ చీర కట్టుకొని.. బొట్టు పెట్టుకొని క్రికెట్ ఆడుతూ చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేశారు.
అంతేకాదు ఈ వీడియోకు ఆమె స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని కూడా జత చేశారు. ‘ప్రతీ చీర మీకంటే ఎక్కువగా మాట్లాడుతుంది. అది నాకు తెలుసు. అంతేకాక.. మీరు ఫిట్‌గా ఉండాలని అది ఎప్పుడూ చెప్పదు. ఈ మహిళా దినోత్సవం రోజు ఏదైన ప్రత్యేకంగా చేసి.. ప్రపంచానికి మీరేంటో చాటి చెప్పండి. మీ జీవితాన్ని మీకిష్టం వచ్చినట్లు జీవించండి’ అంటూ ఆ వీడియోకి మిథాలీ క్యాప్షన్ పెట్టారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్‌లో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మిథాలీ అని, క్రికెట్ ఆడాలి అంటే.. ఇలాగే ఆడాలి అంటూ ఉన్న భావాజాలన్ని మిథాలీ బ్రేక్ చేసింది అని కొందరు నెటిజన్లు ఆమె స్ఫూర్తిని, చైతన్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్స్ పెట్టారు. అలాగే ‘ఇలా చీర కట్టుకొని క్రికెట్ ఆడితే మిమ్మల్ని ఎవరూ క్లీన్ బౌల్డ్ చేయలేరు’ అంటూ మరో వ్యక్తి సెటైరిక్ కామెంట్ చేశాడు. ‘మిథాలీ.. నిజంగా మీరు ఎందరికో ఆదర్శం’ అంటూ మరో నెటిజన్ అభినందనతో కూడిన కామెంట్ పెట్టాడు.