నటనలో అమాయకమైన చూపు, కళ్లార్పకుండా కట్టి పడేసే అందం, పాత్రకు ప్రాణం పోసే ఆమె నటనా చాతుర్యం, అభినయం…ఇలా ఎన్నో విశేషాలు హీరోయిన్ త్రిషకు చాలా మంది అభిమానులను సంపాదించి పెట్టింది. అయితే దేని లెక్క దానిదే అన్న రీతిలో ఆమె వ్యవహారశైలి ఉంటోందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ‘త్రిష ఉత్త మోసం గురూ’ అని దర్శకనిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, ఆమె మాటలు నమ్మితే మోసపోవాల్సిందేనని వారు వాపోతున్నారు. ఎక్కడైనా మగవాళ్ల చేతిలో మహిళలు మోసపోవడం విన్నాం, కన్నాం కదా! కానీ త్రిష చేతిలో తాను మోసపోయానని ఓ నిర్మాత తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.
‘96’ సినిమా సక్సెస్ సాధించడంతో కోలీవుడ్‌లో త్రిష ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆమెకు సినిమా అవకాశాలు లెక్కలేనన్ని వస్తున్నాయి. దీంతో ఆమె బాగా బిజీ అయ్యారు. ఆమె తరువాతి సినిమా ‘పరమపదమ్ విలయాట్టు’ ప్రమోషన్‌కి వస్తానని డుమ్మా కొట్టడంతో నిర్మాత లబోదిబోమంటున్నాడు.
ఇదెక్కడి మోసం అంటూ త్రిషపై నిప్పులు చెరుగుతున్నాడు. ప్రమోషన్‌కి రమ్మని త్రిషను ఆహ్వానించినప్పుడు… తప్పకుండా వస్తానని చెప్పిందనీ, తీరా ఆ సమయానికి రాలేదని ఆ నిర్మాత వాపోయాడు. తన సినిమా ప్రమోషన్ సమయానికే అదే రోజు మరో కొత్త సినిమా ప్రారంభోత్సవం పెట్టుకుందని త్రిషపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కొత్త సినిమా ప్రారంభోత్సవ విషయం ముందే చెప్పి ఉంటే, తామే మరో రోజు ప్రమోషన్ పెట్టుకుని ఉండేవాళ్లం కదా అని ఆ నిర్మాత ప్రశ్నిస్తున్నాడు. ఎన్ని పనులున్నా తప్పకుండా ప్రమోషన్ ఫంక్షన్‌కు వస్తానని మాట ఇచ్చి, ఆ సమయానికి ఎగనామం పెట్టిందని ఆయన వాపోతున్నాడు. ఈ సినిమాలో ఆమె తప్ప మిగతా నటులంతా కొత్తవాళ్లేనని, అందువల్లే ఆమె రాక ఎంతో ఇంపార్టెంట్ అని ఒకటికి పదిసార్లు త్రిషకు గుర్తు చేసినా…చివరికి మోసం చేసిందన్నాడు. త్రిష మోసగించడంపై తాను నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు ఆయన తెలిపాడు.