cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఓ పిట్ట కథ

సినిమా రివ్యూ: ఓ పిట్ట కథ

సమీక్ష: ఓ పిట్ట కథ
రేటింగ్: 2.5/5
బ్యానర్:
భవ్య క్రియేషన్స్
తారాగణం: విశ్వాంత్, సంజయ్ రావు, నిత్య శెట్టి, బ్రహ్మాజీ తదితరులు
కూర్పు: డి. వెంకట ప్రభు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ .ఎన్
నిర్మాత: వి. ఆనందప్రసాద్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: చందు ముద్దు
విడుదల తేదీ: మార్చ్ 06, 2020

‘ఓ పిట్ట కథ’ని పిట్ట కథగా విన్నపుడు ఖచ్చితంగా ఎక్సయిటింగ్‌గా అనిపించే వుండాలి. ఎందుకంటే సింపుల్‌గా చెప్పుకుంటే ఈ కథలో ఒక పసందైన సినిమాకి అవసరమైన ముడి సరుకు ఘనంగా వుంది. బహుశా అందుకేనేమో బ్రహ్మాజీ ఈ చిత్రాన్ని అంత ఇదిగా తన భుజాలమీద మోసారు. అఫ్‌కోర్స్... తనయుడు సంజయ్ రావు తొలి సినిమాకి తన వంతుగా చేయగలిగింది చేసారు కానీ ఈ కథలో విషయం వుందని ఆయనకి అనిపించడంలో తప్పు లేదు. నిజంగానే చందు ముద్దు రాసుకున్న కథ పేపర్‌పై వున్నపుడు ఆసక్తి కలిగించే వుంటుంది. 

అయితే అదే కథ తెర మీదకి వచ్చేసరికి తేలిపోయింది. ఎందుకంటే పిట్ట కథని వెండితెరపై పిట్ట కథలా చెబితే కుదరదు కదా? సినిమాకి కావాల్సిన అంశాలు జోడించాలనే ప్రయత్నంలో దర్శకుడు చందు గాడి తప్పడంతో ఆసక్తికరమైన అసలు కథ కాస్తా ఈ కొసరు మెరుపుల మాటుకి మరుగున పడిపోయింది. ఆరంభంలోనే ఒక యువతి అపహరణకి గురవుతుంది. ఆమెకి ఏం జరిగిందని తెలుసుకోవడం కోసం వెనక్కి వెళితే రెండు కథలు తెరమీదకు వస్తాయి. ఒకటేమో బావా మరదళ్ల మోస్ట్ రొటీన్ లవ్‌స్టోరీ కాగా ఇంకోటేమో ‘కోటలో రాణి పేటలో రాజు’ తరహా ‘థియేటర్లో రాణి గేట్ దగ్గర రాజు’ లవ్‌స్టోరీ. ఈ రెండు కథలు చూసాక గానీ ముఖ్య పాత్రల అసలు స్వరూపం బయట పడదు. కానీ ఈ కథలని దాటి అక్కడి వరకు వెళ్లేలోగా విసుగు, అసహనంతో సహవాసం తప్పదు. 

కథలో మలుపులు, పాత్రల్లో కనిపించని లక్షణాలు, అనూహ్యంగా వచ్చి పడే విచిత్రాలు... చందు రాసుకున్న కథకి మార్కులేసేలా చేస్తుంది. అయితే ఇలాంటి కథని ఏ టోన్‌లో చెప్పాలి, ఎలాంటి మూడ్ మెయింటైన్ చేయాలనే దానిపై బహుశా అతనికి అనుభవం సరిపోక పోయి వుండొచ్చు లేదా వాణిజ్యాంశాలు కావాలంటూ అతనిపై మరెవరైనా ఒత్తిడి పెంచి వుండొచ్చు. కారణం ఏదైనా కానీ సీరియస్ ఎంక్వయిరీ సీన్లలో కామెడీ సీన్లు, డైలాగులు ఇరికించడం సబబు అనిపించదు. ఉదాహరణకి... తన లవ్‌స్టోరీని పోలీస్‌కి చెబుతోన్న ఒక హీరో గతంలో సినిమా తెరపై అతని తండ్రి తాలూకు గతాన్ని కామెడీగా చూపించడం ఈ సినిమాని సీరియస్‌గా తీసుకోనివ్వదు. అలాగే అతని పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే అప్రస్తుత కామెడీ ఇరిటేట్ చేయకుండా వుండదు. హాస్యం అవసరమే కానీ అనవసరమైన చోట చేస్తే అపహాస్యమవుతుందనే దానికిదో బెస్ట్ ఎగ్జాంపుల్.

ఇక ఈ చిత్రంలోని హీరో పాత్రల్లో పాజిటివ్ షేడ్స్‌తో పాటు గ్రే షేడ్స్ కూడా వుంటాయి. ఇలాంటి క్లిష్టమయిన పాత్రలని పండించడానికి నటులకి తగినంత అనుభవం కావాలి. మొదటి సినిమాకే సంజయ్ రావుకి ఇది పెద్ద పరీక్షే అనాలి. అలాగే విశ్వాంత్‌కి వున్న కొద్దిపాటి అనుభవం కూడా సరిపోలేదనే చెప్పాలి. హీరోయిన్ నిత్య కానీ, ఆమె తండ్రి పాత్ర పోషించిన నటుడు కానీ అంతంతమాత్రంగానే అనిపించారు. బ్రహ్మాజీ పాత్రని సీరియస్‌గా పరిచయం చేసి ఈజీగా బురిడీ కొట్టించేసారు. ఈ క్యారెక్టర్ నెరేట్ చేసినపుడు పుత్ర వాత్సల్యంతో ఆయన ఎక్కువ ప్రశ్నలేసి వుండకపోవచ్చు. కానీ ఆ పాత్రలోని లోపాలని ప్రేక్షకులు అంత ఈజీగా ఓవర్‌లుక్ చేయలేరు. 

సాంకేతిక విభాగంలో ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపించగా, నేపథ్య సంగీతం సోసో అనిపించుకుంటుంది. పిట్ట కథ కావడంతో నిర్మాత షార్ట్ ఫిలిం ప్రొడక్షన్ వేల్యూస్ చాలనుకున్నట్టున్నారు. ముందుగా చెప్పినట్టు చందు మంచి కథే రాసుకున్నాడు కానీ దానిని ఆసక్తికరమైన సినిమాగా మలిచే విధంగా కథనం రాసుకోలేదు. అతని అనుభవలేమికి తోడు నటీనటుల ఇన్‌ఎక్స్‌పీరియన్స్ కూడా జత కలవడంతో ఈ పిట్ట కథ ఆశించిన స్థాయిలో ఎక్సయిట్ చేయలేదు. 

స్క్రీన్‌ప్లే పరంగా జాగ్రత్తలు తీసుకుని, కొన్ని మలుపులని ముందుగా ఊహించలేని విధంగా పకడ్బందీగా తెరెకక్కించినట్టయితే, అనవసరపు హంగులకి పోయి అక్కర్లేని హాస్యాన్ని పక్కన పెట్టినట్టయితే, అన్నిటికీ మించి లీడ్ యాక్టర్లు తమ పాత్రల్లోని భిన్న పార్శ్వాలని ప్రేక్షక రంజకంగా పోషించినట్టయితే ఈ పిట్ట కథ కూత ఇంకొంచెం ఘనంగా వుండేది. ఇవన్నీ జరగకపోవడంతో యూట్యూబ్‌కి ఎక్కువ, సిల్వర్ స్క్రీన్‌కి తక్కువ అన్న చందంగా మిగిలిపోయింది.  

బాటమ్ లైన్: పిట్ట ఘనం.. కూత కొంచెం!

గణేష్ రావూరి

 


×