మోదీ స‌ర్కార్‌కు ఊపిరాడ‌డం లేదు

దేశ‌మంతా క‌రోనా రోగుల‌కు ఊపిరాడ‌డం లేద‌ని మాత్ర‌మే మ‌న‌కు తెలుసు. కానీ క‌రోనాను ఎదుర్కోవ‌డంలో విఫ‌ల ప్ర‌భుత్వంగా ఇంటా బ‌య‌టా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న మోదీ స‌ర్కార్‌కు కూడా ఇప్పుడు ఊపిరాడ‌డం లేదు. అన్ని వైపుల…

దేశ‌మంతా క‌రోనా రోగుల‌కు ఊపిరాడ‌డం లేద‌ని మాత్ర‌మే మ‌న‌కు తెలుసు. కానీ క‌రోనాను ఎదుర్కోవ‌డంలో విఫ‌ల ప్ర‌భుత్వంగా ఇంటా బ‌య‌టా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న మోదీ స‌ర్కార్‌కు కూడా ఇప్పుడు ఊపిరాడ‌డం లేదు. అన్ని వైపుల నుంచి వ‌స్తున్న తీవ్ర విమ‌ర్శ‌ల‌తో మోదీ స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 

కేవ‌లం రాజ‌కీయంగా పెత్త‌నం చెలాయించాల‌న్న ఏకైక అజెండాతో   ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ నేత‌ల‌పై త‌మ చేతుల్లో ఉన్న సీబీఐ, ఈడీ లాంటి వ్య‌వ‌స్థ‌ల్ని ప్ర‌యోగిస్తున్న మోదీ సర్కార్‌కు మొద‌టి సారిగా ప్ర‌జావ్య‌తిరేక‌త ఎలా ఉంటుందో తెలుసొస్తోంది.

మోదీ స‌ర్కార్‌ది తోలు మందం ప్ర‌భుత్వ‌మ‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) ఘాటు వ్యాఖ్య‌లు చేసిందంటే …కేంద్ర ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత‌ తీవ్ర‌తను ప్ర‌తిబింబిస్తోంది. కేవ‌లం మోదీ స‌ర్కార్ అల‌స‌త్వం, అజ్ఞానం వ‌ల్లే ఈ రోజు కోట్లాది మంది భార‌తీయులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తోంద‌ని అంత‌ర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. 

ఇక దేశీయ మీడియా మోదీ స‌ర్కార్ జేబు సంస్థ‌గా మార‌డంతో నిజాలు రాయ‌డానికి చేతులు, మాట్లాడ్డానికి నోళ్లు క‌ట్టేసుకుంది. కానీ సోష‌ల్ మీడియా మాత్రం మోదీ స‌ర్కార్‌ను చాకిరేవు పెడుతోంది.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ‌కు ఇండియన్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) తాజాగా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతూ ఓ లేఖ రాసింది. క‌రోనా సెకెండ్ వేవ్‌పై వైద్య నిపుణుల హెచ్చ‌రిక‌ల‌ను బుట్ట‌దాఖ‌లు చేయ‌డంపై ఐఎంఏ విరుచుకుప‌డింది.  

క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా తోలుమందం వ్యవహారంతో ముందుకు పోయిందని ఆరోపించింది. కేంద్ర ప్ర‌భుత్వ‌ నిర్లక్ష్యం కార‌ణంగా ఇప్పుడు రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

సెకెండ్ వేవ్‌ సంక్షోభం నుంచి దేశాన్ని ర‌క్షించుకునేందుకు ఇప్పటికైనా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించాలని కోరింది. ప్రణాళికా బ‌ద్ద‌మైన లాక్‌డౌన్‌ను విధించి వైర‌స్‌ వ్యాప్తిని నిరోధించడంతో పాటు వైద్య సిబ్బందికీ ఊపిరి పీల్చుకునే వీలు కలుగు తుందని ఐఎంఏ స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు స‌మాచార హ‌క్కు చ‌ట్టం మాజీ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఐసీ), ప్ర‌ముఖ న్యాయ నిపుణుడు మాడ‌భూషి శ్రీ‌ధ‌ర్ ప్ర‌ధానిపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చర్చ‌కు దారి తీశాయి.

ప్ర‌స్తుత కోవిడ్ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో భారత దేశానికి పని చేసే ప్రధాని అవసరం ఉందని మాడభూషి శ్రీధర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ప్ర‌స్తుత ప్ర‌ధాని మోదీ ప‌నిచేయ‌ని ప్ర‌ధానిగా ఆయ‌న చేసిన ప‌రోక్ష వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆలోచింప చేస్తున్నాయి. 

వీలైనంత త్వరగా దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ రెండు డోసులు ఇవ్వాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు, హాస్య ర‌చ‌యిత జీఆర్ మ‌హ‌ర్షి త‌న ఫేస్‌బుక్‌లో… గౌర‌వ మ‌ర‌ణాన్ని ఇవ్వండి మోదీ సార్‌! శీర్షిక‌తో రాసిన వ్యాసం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

“చావు మాకు కొత్త కాదు. రోజూ చ‌స్తూ బ‌తుకుతున్న వాళ్ల‌మే. ఇంత‌కు మునుపు చ‌స్తే న‌లుగురు మోసి మ‌ట్టి చ‌ల్లేవాళ్లు. ఇప్పుడు ప్లాస్టిక్ సంచిలో విసిరేస్తారు. మ‌ర‌ణాన్ని గౌర‌వించాల‌ని హిందూ ధ‌ర్మ శాస్త్ర‌మే కాదు, అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. మ‌మ్మ‌ల్ని జీవించేలా చూడండి లేదంటే గౌర‌వంగా మ‌ర‌ణించేలా చూడండి!” అని మ‌హర్షి భావోద్వేగంతో ప్ర‌ధానికి చేసిన అభ్య‌ర్థ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ క‌నెక్ట్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇలా అన్ని స్థాయిల్లో చుట్టుముట్ట‌డం వ‌ల్లే మోదీ స‌ర్కార్‌కు ఊపిరి ఆడ‌డం లేదని చెప్ప‌డం.

సొదుం ర‌మ‌ణ‌