ప్రధాని మోదీకి మద్దతుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు రీట్వీట్ చేయడం వల్ల తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోగొట్టుకున్నదేంటో వైసీపీ గుర్తిస్తోందా? అనేది ఇప్పుడు ప్రశ్న.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాధారణంగా ప్రచారానికి దూరంగా ఉంటారు. తనపై , తన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చినా ఆయన అసలు పట్టించుకోరు. అలాంటి నేత ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచి, దేశ వ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేపారు.
వైఎస్ జగన్ ట్వీట్‌కు జార్ఖండ్ నుంచి ఒక రోజు ఆలస్యంగా కౌంటర్ వచ్చింది. దీంతో మరోసారి జగన్ ట్వీట్‌పై చచ్చకు దారి తీసింది. అయితే ఆ ట్వీట్‌లో ఎక్కడా ఆవేశం, ఆరోపణలు లేవు. కానీ జగన్ చిన్నబుచ్చుకునేలా ఉంది.
ఎందుకంటే మనిషి జాలి పొందడం కంటే దురదృష్టం మరొకటి ఉండదు. ముఖ్యమంత్రిగా అందరిపై జాలి చూపుతూ, సంక్షేమ రథసారథిగా ప్రశంసలు అందుకుంటున్న జగన్ …మరొకరి నుంచి దయ పొందడం కంటే చిన్నతనం ఏముంటుంది? అదే జార్ఖండ్ అధికార పార్టీ ట్వీట్‌లో ప్రతిబింబించింది.
మరో కీలకమైన అంశం ఏంటంటే …జగన్ జార్ఖండ్ సీఎంకు నేరుగా ట్వీట్ చేస్తే, హేమంత్ సోరెన్ స్పందించకుండా, ఆయన పార్టీ జవాబు ఇవ్వడం గమనార్హం. అంతే జగన్‌కు స్పందించే స్థాయి తనది కాదని జార్ఖండ్ సీఎం చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం జగన్ హితవు చెప్పిన నేపథ్యంలో జార్ఖండ్ అధికార పార్టీ ముక్తి మోర్చా రీట్వీట్ చేసింది.
‘వైఎస్ జగన్ జీ! మీ నిస్సహాయత గురించి దేశమంతటికీ తెలుసు. మేం మీ మీద ప్రేమాభిమానాలు చూపుతున్నాం. మీరు ఎప్పుడూ సుఖంగా ఉండాలి’ అని వ్యాఖ్యానించింది. ఇంతకంటే జగన్‌కు చిన్నతనం ఏం కావాలి? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీ నిస్సహాయత గురించి దేశమంతటికీ తెలుసు అనే వాక్యాన్ని ఎన్ని రకాలుగా అయినా అర్థం చేసుకోవచ్చు.
అది వారి సృజనాత్మక ఆలోచనలపై ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌పై జార్ఖండ్ అధికార పార్టీ జాలి, దయ చూపిందనేది వాస్తవం. మీ ట్వీట్ వెనుక ఉద్దేశం ఏంటో మాకు తెలుసు, దానికి సానుభూతి చూపుతున్నామనే లోతైన అర్థం అందులో దాగి ఉందని చెబుతున్నారు.
తమకు హితవు చెప్పినప్పటికీ, తాము పట్టించుకోవడం లేదని, ప్రేమాభిమానాలు చూపుతుంటామనడం ద్వారా ఒక మెట్టు పైకెక్కారని చెప్పొచ్చు. ప్రధానంగా జార్ఖండ్ సీఎం స్పందించకపోవడం అన్నిటికీ మించి జగన్ స్థాయి ఏంటో ఆ రాష్ట్ర అధికార పార్టీ చెప్పకనే చెప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ట్వీట్ వెనుక ఉద్దేశాలు ఏవైనప్పటికీ, ఆయనకు, తద్వారా వైసీపీకి బాగా డ్యామేజీ అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోదీకి మద్దతుగా నిలబడడం వల్ల వ్యక్తిగతంగా జగన్, ఏపీ ప్రభుత్వం పొందిన, పొందుతున్న లాభాలేంటో ఎవరికీ తెలియదు కానీ, అందరి దృష్టిలో చులకన అయ్యారనేది వాస్తవం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటే ఇదేనేమో!
సొదుం రమణ