సొంత పార్టీ, సహచర రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్ నరసింహారావుపై ఫిరాయింపు ఎంపీ సుజనాచౌదరి గురువారం తన అక్కసు వెళ్లగక్కాడు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని, అందులో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. కానీ అదే పార్టీకి చెందిన టీడీపీ నుంచి ఫిరాయించిన ఎంపీ సుజనాచౌదరి మాత్రం తగిన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని హెచ్చరిస్తూ వస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఓ చానల్ ఇంటర్వ్యూలో జీవీఎల్ మాట్లాడుతూ సుజనాచౌదరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.
‘కొంత మంది విభజన చట్టంలో కొన్ని అంశాలున్నాయని, దాని ద్వారా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, కొన్ని డిబేట్స్‌లో చెప్పడం విన్నా. అలా చెప్పే వాళ్లలో కొందరు అధికార ప్రతినిధులు కాదు. కొంత మందికి కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచనల పట్ల అవగాహన లేదు. నేను చెప్పేదే కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వ లైన్. చాలా స్పష్టంగా చెబుతున్నా ఇది. కొంత మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారికి ఇంకా పాత వాసనలు పోలేదేమో…అది కూడా కొంత ఆస్కారం ఉంది. తప్పనిసరిగా, పూర్తిగా బీజేపీ చెప్పే విధానాలనే వాళ్లు నడుచుకోవాలి’ అని గతంలో జీవీఎల్ గట్టిగా పరోక్ష హెచ్చరికలు జారీ చేశాడు.
తాజాగా సుజనాచౌదరి పరోక్షంగా జీవీఎల్‌పై ఫైర్ అయ్యాడు. జీవీఎల్‌ను ఎల్లయ్య, పుల్లయ్యతో పోల్చి అవహేళన చేశాడు.
అమరావతికి బీజేపీ కట్టుబడి ఉన్నదని ఆ పార్టీ రాష్ట్రశాఖ తీర్మానించిందని, మరోపక్క బీజేపీ జాతీయ స్థాయి నేతలు కొందరు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై రైతుల్లో అనుమానాలు చెలరేగుతున్నాయని సుజనాచౌదరి వద్ద ప్రస్తావించగా.. ‘కొందరు నేతల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దనవసరంలేదు. ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో చెప్పేవాటికి స్పందించనక్కర్లేదు. అమరావతి విషయంలో బీజేపీ తొలి నుంచీ ఒకే వైఖరితో ఉంది. కచ్చితంగా కాపాడుకుని తీరతాం’ అని ఆయన స్పష్టం చేశాడు.
కాగా ఈ మాటలు మాట్లాడిన రెండుమూడు గంటలకే జీవీఎల్ మళ్లీ మీడియా ముందుకొచ్చాడు. గతంలో చెబుతున్న విషయాలనే మరోసారి ఆయన పునరుద్ఘాటించడం గమనార్హం. దీంతో సుజనాకు గాలి తీసినట్టైంది.