రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడి, 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఏపీలో ఓ విదేశీ కంపెనీ భారీ ఉక్కు పరిశ్రమ స్థాపించేందుకు ముందుకొస్తే….ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు భయమెందుకో అర్థం కావడం లేదు. కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా ఆ వార్తను ఆ రెండు పత్రికలు కూడబలుక్కున్నట్టు మొక్కుబడిగా వార్తను రాశాయి. ఇదే జగన్ స్థానంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే…ఈ వార్తను ఇలాగే క్యారీ చేసేవారా? అబ్బే…ఎంత మాత్రం కాదు. చంద్రబాబు రాజనీతి, లోకేశ్ చాణిక్యంతో భారీ పరిశ్రమ తీసుకొచ్చారని చంకలు గుద్దుకుని రాసేవారు. అక్షరాలతో రాధాకృష్ణ, రామోజీ జెజ్జనక తొక్కేవాళ్లు.
‘బాబు ఉక్కు సంకల్పం’ అంటూ ఓ భారీ శీర్షికతో మెయిన్ ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్‌గా ఇచ్చేవాళ్లు. అంతేకాదు, ఈ పరిశ్రమను నెలకొల్పడం వల్ల ప్రత్యక్షంగా ఎన్ని వేల మందికి, పరోక్షంగా ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేవాళ్లో రాసి పడేసేవాళ్లు. కానీ జగన్ సీఎం కావడంతో, ఆ క్రెడిట్ దక్కడాన్ని ఆ రెండు పత్రికలు ఎంత మాత్రం జీర్ణించుకోలేకున్నాయి.
‘కడపలో ఉక్కు కర్మాగారంపై స్విస్ కంపెనీ ఆసక్తి’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి మెయిన్ రెండో పేజీలో మొక్కుబడిగా ఓ చిన్న వార్తను క్యారీ చేసింది. అలాగే ఈనాడు విషయానికి వస్తే…లోపలి పేజీలో ‘కడప జిల్లాలో ప్రైవేట్ ఉక్కు పరిశ్రమ !’ శీర్షికతో సింగిల్ కాలమ్ వార్త రాశారు. ఒకవైపు జగన్ వల్ల పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయంని శివాలెత్తినట్టు ‘కియా’పై అసత్య వార్తా కథనాలు రాసిన విషయం తెలిసిందే. అలాగే కొత్త పరిశ్రమలు ఏ మాత్రం రాలేదంటూ ప్రతిపక్షాలతో పాటు ఎల్లో మీడియా గగ్గోలు పెడుతూ వస్తున్నాయి. కానీ ఓ భారీ పరిశ్రమను నెలకొల్పేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘ఐఎంఆర్ ఏజీ’ ప్రతినిధులు సీఎంతో చర్చలు జరపడం ఎంతో శుభసూచికం. కానీ రాష్ట్రానికి ఏవీ రాకూడదనేదే ప్రతిపక్షాలు, పచ్చ పత్రికల ఉద్దేశమని…ఈ వార్తను రాయడంలోనే తెలిసిపోతున్నది.
స్విడ్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘ఐఎంఆర్ ఏజీ’ సుమారు రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడి, 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత గత డిసెంబర్‌లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
తాజాగా అదే నియోజకవర్గంలో మరో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్విట్జర్లాండ్ కంపెనీ ప్రతిపాదించింది. కంపెనీ ప్రతినిధులు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమై వైఎస్సార్ జిల్లాలో ప్లాంట్ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేశారు. తాము ఇప్పటికే ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం గనుల తవ్వకాలతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నిర్వహిస్తున్నట్లు సీఎంకు ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు.
ఐఎంఆర్ ఏజీ ప్రతినిధి బృందం నిలిచిపోయిన బ్రహ్మణి స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించింది. స్టీల్ ప్లాంట్‌కు కేటాయించిన భూములు, నీటి వసతి, రైల్వే, విమానాశ్రయం తదితర అంశాల గురించి స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఐఎంఆర్ బృందానికి వివరించాడు. రెండు స్టీల్ ప్లాంట్‌ల ఏర్పాటుతో రాయలసీమలో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని సుధీర్‌రెడ్డి పేర్కొన్నాడు.
కాగా జమ్మలమడుగులో కొత్తగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన స్విట్జర్లాండ్ కంపెనీకి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చాడు. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు వేగవంతం చేసినట్టు తనను కలిసిన కంపెనీ ప్రతినిధులతో చెప్పాడు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామని, ఐఎంఆర్ కూడా మరో స్టీల్‌ప్లాంట్ నెలకొల్పితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం వారితో అన్నాడు. ఉక్కును విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉన్న రవాణా అనుకూలతలను సీఎం వివరించాడు.
రాష్ట్రంలో ఓ భారీ పరిశ్రమ స్థాపనకు ముందడుగు పడుతున్న సమాచారానికి సంబంధించి కనీసం ఆ రెండు పత్రికల్లో ఫస్ట్ పేజీల్లో ఇండికేషన్‌కు కూడా నోచుకోకపోవడం గమనార్హం. ఎంతసేపూ జగన్ పాలనలో ఏపీలో దుర్మార్గాలు జరిగిపోతున్నాయని విషపు ప్రచారం చేసి, పరిశ్రమల స్థాపనకు అననుకూల వాతావరణాన్ని సృష్టించడమే తమ పనిగా ప్రతిపక్షాలు, వాటికి బాకా ఊదే పత్రికలు, చానళ్లు ఉన్నాయని చెప్పేందుకు ఇదే పెద్ద నిదర్శనం.