లక్ష్మీ పార్వతిని చంద్రబాబు అత్తగా అంగీకరిస్తారో లేదో తెలియదు కానీ.. అవకాశం వస్తే.. అలాంటి వాడిని అల్లుడు అని చెప్పుకోడానికి కూడా తనకు సిగ్గేస్తుందంటూ లక్ష్మీపార్వతి మాత్రం శివాలెత్తుతారు. తాజాగా మరోసారి ఆమె చంద్రబాబుపై తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే చంద్రబాబు.. మహిళలకు అన్యాయం చేస్తున్నారంటూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సిగ్గుచేటన్నారామె.
ఎన్టీఆర్ మెడపట్టి బాబుని పార్టీలో నుంచి బైటకు తోసేస్తే.. తనని బతిమిలాడుకుని, తన రికమండేషన్ తో తిరిగి ఎన్టీఆర్ పంచన చేరారని గుర్తు చేశారు లక్ష్మీపార్వతి. అప్పుడు తనని వాడుకున్న బాబు.. ఆ తర్వాత కూడా మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారని, ఆయన జీవితమంతా ఇలాంటి నీఛ రాజకీయాలకే సరిపోయిందని అన్నారు. చివరి స్టేజ్ కి వచ్చిన బాబు.. ఇప్పుడైనా ఒకటీ రెండు మంచి పనులు చేయాలని సూచించారు.
తన భార్య భువనేశ్వరిని అడ్డం పెట్టుకుని కూడా బాబు రాజకీయం చేశారని చెప్పుకొచ్చారు లక్ష్మీపార్వతి. అమరావతికి వచ్చిన విరాళాల లిస్ట్ కూడా చదివి వినిపించారు. కేవలం తన భార్య రెండు గాజుల్ని ఎరగా వేసి, అమాయకుల దగ్గర 24 బంగారు గాజులు, 29 ఉంగరాలు, 41 చెవిపోగులు, నల్లపూసల దండలు 2, బ్రేస్ లెట్స్ 2.. ఇలా మొత్తం 112 ఆభరణాలు విరాళాలుగా సేకరించారని ఆరోపించారు. అవినీతి సొమ్ము కోట్లు పోగేసుకున్న బాబు, ఆ డబ్బుని ఖర్చు చేయొచ్చుకదా అని ప్రశ్నించారు లక్ష్మీపార్వతి.
చివరకు కమ్మజాతిని కూడా పూర్తిగా మోసం చేశారని, పాపం ఆ వర్గంలో కొందరు బాబుని నమ్ముకుని అమరావతిలో పెట్టుబడులు పెట్టి మోసపోయారని, వారిలో ఇప్పుడు కొంతమంది రోడ్డున పడ్డారని, ఆ పాపం బాబుకే తగులుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.