ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడంలో కీలకంగా పనిచేసి, ఆ తర్వాత ఆయన వెంటే ఉంటూ.. ఆయన విదేశాలకు వెళ్లిన వెంటనే ఇక్కడ వ్యవహారం చక్కబెట్టి తాను ముఖ్యమంత్రి అయిపోయారు నాదెండ్ల భాస్కర్ రావు. ఆ ఎపిసోడ్ తో ఆయన రాజకీయ జీవితంపై చెరగని మచ్చపడింది. ఆ ఘటనతోనే చంద్రబాబు నక్కజిత్తులతో ఎన్టీఆర్ ఫ్యామిలీలోకి ఎంటర్ కావడం, నాదెండ్ల కంటే ఘోరమైన వెన్నుపోటుతో ఎన్టీఆర్ ని చావుదెబ్బ కొట్టడం.. అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. సరిగ్గా జనసేన పార్టీలో కూడా ఇలాంటి ఛాయలే కనిపిస్తున్నాయి. పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాల్లోకి వెళ్లిపోయారు, పార్టీ బాధ్యత అంతా నాదెండ్ల మనోహర్ కి అప్పగించారు. పవన్ పరోక్షంలో జూనియర్ నాదెండ్ల బాగానే యాత్రలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో సుడిగాలి పర్యటనలు చేస్తూ జనసైనికులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
వాస్తవానికి పవన్ ఉన్నప్పుడు కూడా పార్టీపై మనోహర్ పెత్తనం కాస్త ఎక్కువగానే ఉండేది. ఏకంగా ఎమ్మెల్యేని కూడా లెక్కలేకుండా మాట్లాడే తెంపరితనం ఆయనది. అలాంటి అవమానాలు భరించలేకే.. రాపాక వరప్రసాద్ పార్టీకి దూరంగా ఉన్నారు. అలాంటి మనోహర్.. పవన్ పక్కనలేకపోతే ఇంకెలా చెలరేగిపోతారో సింపుల్ గా ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఆయన పర్యటనల్లో కనిపిస్తోంది.
కనీసం అధినేత మనకిలా చెప్పారు అని కూడా పవన్ ని గుర్తు చేసుకోవడం లేదట నాదెండ్ల. తానే ఆదేశిస్తున్నట్టు, అవన్నీ కార్యకర్తలు పాటించాలన్నట్టు కాస్త అహంకార ధోరణితో మాట్లాడుతున్నట్టు జనసేన అంతర్గత సమాచారం. ఇప్పటికే ఈ ధోరణిపై విసిగిపోయిన కొందరు, పవన్ కి ఫిర్యాదు చేసినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. భాస్కర్ రావుని విమర్శించిన కొందరిపై పార్టీ వేటు వేసింది కూడా.
ఒకరకంగా మనోహర్ ని పవన్ కల్యాణ్ కాస్త ఎక్కువగానే నమ్ముతున్నారు. అందుకే ఆయనకి ఫుల్ చార్జ్ ఇచ్చేసి తాను సినిమాల్లోకి వెళ్లిపోయారు. మరి “నాదెండ్ల వారసత్వం” ఇక్కడ కనిపిస్తుందా లేదా అనేది చూడాలి. వాస్తవానికి మనోహర్ కి అంత ధైర్యం లేదు, పోనీ పార్టీని లాగేసుకుంటాడనుకున్నా.. పవన్ కే సొంతంగా గెలిచే సత్తాలేదు, ఇక అలాంటి పార్టీని తీసుకుని ఆయనేం చేసుకోవాలి.
పార్టీని సొంతం చేసుకోవాలనే ఆలోచన మనోహర్ కి లేదు కానీ, పెత్తనం చేయాలనే ఆశ మాత్రం మెండుగా ఉంది. అందుకే పవన్ కల్యాణ్ కి జూనియర్ నాదెండ్లతో “వెన్నుపోటు ఎఫెక్ట్” మాత్రం ఉండదని అంటారు. అప్పుడు తండ్రి ఎన్టీఆర్ ని పూర్తిగా పక్కకు నెట్టేసి పార్టీని లాక్కుంటే.. ఇప్పుడు తనయుడు పవన్ ని తోలుబొమ్మలా చేసి పార్టీతో ఆడుకుంటున్నారు. అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్.