ఏ అలవాటైనా శృతి మించకపోతే ఇబ్బంది లేదు. అలవాట్లు కాస్తా వ్యసనంగా మారితేనే సమస్య. అయితే ఏ వ్యసనమైనా ముందు అలవాటుతోనే ప్రారంభమవుతుందని గ్రహించాలి. మరీ ముఖ్యంగా మద్యం సేవించడం అనేది మొదట్లో బీర్‌తో మొదలై…ఆ తర్వాత ఎక్కడెక్కడికి తీసుకుపోతుందో దానికే తెలియదు. మందుకు బానిసైతే మాత్రమే మనిషి ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా పతనమవుతాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు….చాలా మంది మందుకు బానిసలై అన్ని రకాలుగా నష్టపోయిన తర్వాత మేల్కొంటుంటారు. దాని వల్ల ప్రయోజనం ఉండదు.
తాజాగా మలయాళ చిత్రపరిశ్రమ ముద్దుగుమ్మ వీణా నందకుమార్ మద్యం సేవించడంపై లెక్చరర్ ఇస్తోంది. మందు తాగడం ఎలా కరెక్టో ఆ హీరోయిన్ లా పాయింట్ లేవదీస్తోంది. అంతే కాదు తన తాగుడును తప్పు పట్టేందుకు మీరెవరు అంటూ నిలదీస్తోంది.
`నాకు మద్యం సేవించడమంటే చాలా ఇష్టం. అలాగని తాగాక ఎవరినీ ఇబ్బంది పెట్టను. కాకపోతే కాస్త ఎక్కువ మాట్లాడతానంతే`.. ఇలా చెప్పుకుపోయింది ఆ హీరోయిన్. తాగుడు గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారామె.
`నేను బీర్లు చాలా ఎక్కువగా తాగుతా. అది నేరమేమీ కాదు కదా! నేను మందు తాగడం వల్ల మరెవ్వరికో నష్టం లేదు. ఈ విషయంలో నన్ను విమర్శించే హక్కు ఎవరికీ లేదు. నేను నా వ్యక్తిగత అవసరం కోసం తాగుతున్నాను. అయినా ఇప్పుడు అందరూ తాగుతున్నారు కదా! నేను కూడా అంతే. నా అలవాటు గురించి బయటకు చెప్పేందుకు నేను భయపడను` అని వీణ చెప్పింది.
సమాజం అన్న తర్వాత కొన్ని కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఉంటాయి. వ్యక్తి స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన తననెవరూ ప్రశ్నించకూడదనడం సరైంది కాదు. తాగుడుకు బానిసైన మహానటి సావిత్రి లాంటి వాళ్ల బతుకు చివరి రోజుల్లో ఎలా ఉందో తెలుసుకుంటే వీణకు మంచిది. అయితే ఒకటి మాత్రం నిజం. మందును మనిషి తాగినంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మనిషిని మందు తాగడం ప్రారంభమైతేనే అసలు సమస్య. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనే ఆ ముద్దుగుమ్మకు ఎవరైనా సలహాలిచ్చి ఉండొచ్చు.