ఎక్కడైనా పేదలకు ఇళ్లు ఇవ్వడం లేదని ఆందోళనలు చేస్తారు. అలా ఆందోళనలు చేయడాన్ని మనం ఎన్నో చూసి ఉంటాం. పేదలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ పాలకులు కల్పించాలనే డిమాండ్‌తో కలెక్టరేట్ల వద్ద రోజుల తరబడి దీక్షలు కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ పేదలకు ఖరీదైన రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల కేటాయింపు ఏమిటి అంటూ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నాం.
అయితే అలాంటి వారి ఆగడాలకు హైకోర్టు చెక్ పెట్టింది. రాజధాని ప్రాంత పరిధిలో ” పేదలందరికీ ఇళ్లు” పథకం కింద నిరుపేదలకు ఈ ఉడాదికి ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న సన్నాహకాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో పేదలకు ఇంటి కలను ఛిద్రం చేస్తామనుకున్న వాళ్ల కలలు కల్లలయ్యాయి. ప్రభుత్వ ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని హైకోర్టు తేల్చి చెప్పింది.
హైకోర్టు నిర్ణయం 54 వేల కుటుంబాల నిరుపేదలకు ఎంతో ఊరటనిచ్చింది. ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు విషయమై ఈ నెల 25వ తేదీలోపు ప్రభుత్వం తీసుకునే చర్యల్లో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 25వ తేదీ ఉగాదికి ఏపీలో 26 లక్షల కుటుంబాలకు ఇంటి పట్టాల పంపిణీ చేపట్టాలని జగన్ సర్కార్ సీరియస్‌గా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.