చాన్నాళ్లయిపోయింది బాపు-మెగాస్టార్ కాంబినేషన్ లో 'మంత్రిగారి వియ్యంకుడు సినిమా వచ్చి. అల్లు రామలింగయ్య మంత్రిగా, ఆయనను ఆటపట్టించిన అల్లుడిగా మెగాస్టార్ కలిసి పండించిన నవ్వులు ఇన్నీ అన్నీ కావు. ఇప్పుడు అలాంటి లైన్ తోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తరువాత సినిమా చేయబోతున్నట్లు బోగట్టా.
అ..ఆ సినిమా దగ్గర నుంచి త్రివిక్రమ్ ఒక కొత్త ఫార్ములా కనిపెట్టారు. మిడ్ 70-80 లో వచ్చిన సినిమాల లైన్ లను కొత్తగా, గ్రాండియర్ తో, పెద్ద హీరోలతో, ఎంటర్ టైన్ చేస్తూ మార్చడం అన్నది ఆ ఫార్ములా. ఇటీవల అల వైకుంఠపురములో సినిమా కూడా అలాంటిదే అన్నది అందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం త్రివిక్రమ్ ఈసారి ఈ 'మంత్రిగారి వియ్యంకుడు' కాన్సెప్ట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ మామను అల్లుడు ఆటపట్టించడం, ఆటకట్టించడం టైపు అన్నమాట. అంతే కానీ పొలిటికల్ పార్టీలు, విధానాలు, హామీలు ఇలాంటివి వుండవు. జస్ట్ పొలిటీషియన్ల మీద లైట్ సెటైర్లు మాత్రం వుంటాయి.
ఈ సినిమా కోసం 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి ఈ సినిమా పూర్తి స్థాయిలో సెట్ మీదకు వెళ్తుంది. హీరోయిన్ వెదుకులాట సాగుతోంది. తెలుగులో ఇప్పటికే చేసిన వారిలో పూజా హెగ్డే ఒక ఆప్షన్ మాత్రమే. బాలీవుడ్ అమ్మాయిల కోసం డిస్కషన్ నడుస్తోందని బోగట్టా.