ఒకవైపు కరోనా వైరస్ గురించి నిజాలు, అబద్ధాలు ఆ వైరస్ కన్నా శరవేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. వీటితోనే ప్రపంచం గడగడలాడుతూ ఉంది. కరోనా వైరస్ సోకిన కొంతమందికి చికిత్స అందించి వైద్యులు ఇప్పటికే ఇంటికి పంపారు కొన్ని చోట్ల. అధికారికంగా మందు కనుగొనకపోయినా.. ఇండియాతో సహా చైనాలో కూడా పలువురు కరోనా బాధితులను తిరిగి ఆరోగ్యవంతులను చేశారు వైద్యులు.
మరోవైపు కరోనాకు విరుగుడు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్య సంస్థలు, మందుల కంపెనీలు గట్టిగానే పని చేస్తూ ఉన్నాయి. ఆ వ్యాధి లక్షణాలను పరిశీలించి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక జపాన్ కంపెనీ కరోనాకు విరుగుడు మందు కనుగొనేందుకు, ఆ వైరస్ ను జయించిన వ్యక్తుల బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తూ ఉందట.
ఆ వైరస్ ముందుగా సోకి, ఆ తర్వాత దాని ప్రభావం నుంచి బయటపడిన మనుషుల్లో ఆ వైరస్ ను జయించే శక్తి ఉన్నట్టే! వారికి ఆ ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్టే. ఈ నేపథ్యంలో వారి బ్లడ్ శాంపిల్స్ ను తీసుకుని, వారి ప్లాస్మాను పరిశీలించి అందులో ఉన్న లక్షణాలను పరిశీలించనున్నారట. ఆ బ్లడ్ శాంపిల్స్ లో కరోనా విరుగుడు శక్తి ఉన్నట్టే. కాబట్టి.. ఆ వ్యాధి సోకిన వారికీ ఆ తరహా వ్యాధి నిరోధకత శక్తిని వ్యాక్సినేషన్ గా ఇస్తే.. అప్పుడు కరోనాను నియంత్రించవచ్చు అనే ఐడియా వచ్చిందట ఆ జపనీ కంపెనీకి. ఈ మేరకు ప్లాస్మా శాంపిల్స్ పరిశీలించడం అనేది కరోనాకు విరుగుడును కనుగొనడంలో కీలక పాత్ర అవుతుందని ఆ వైద్య పరిశోధకులు అంటున్నారు.