సినిమా తారల ఎండోర్స్ మెంట్ పారితోషకాలు, ఒప్పందాలు భారీ స్థాయిలో ఉంటాయనే సంగతి తెలిసిందే. తమ డిమాండ్ కు తగ్గట్టుగా వారు ఇలాంటి ఒప్పందాలను క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్… ఒక భారీ డీల్ ను కుదర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది దేశంలోనే అత్యంత భారీ విలువైన ఒప్పందం అని సమాచారం.
ఒక స్మార్ట్ ఫోన్ కంపెనీతో ఎండోర్స్ మెంట్ డీల్ కుదర్చుకున్నాడట సల్మాన్ ఖాన్. దీనికి గానూ ఏకంగా ఏడు కోట్ల రూపాయల మొత్తాన్ని ఆ సంస్థ సల్మాన్ కు చెల్లించనుందట. ఇది ప్రస్తుతానికి దేశంలో నమోదైన అత్యంత భారీ ఎండోర్స్ మెంట్ డీల్ అని అంటున్నారు.
చాలా రకాల స్మార్ట్ ఫోన్లకు స్టార్ హీరోల స్థాయి అంబాసిడర్లు ఉన్నారు. క్రికెటర్లు, బాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ హీరోలు కూడా వివిధ బ్రాండ్ల ఫోన్లను ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిగత ఒప్పందాల్లో కెళ్లా సల్మాన్ డీల్ అత్యంత భారీ స్థాయిదని తెలుస్తోంది.
ఈ ప్రమోషన్ యాడ్ కోసం సల్మాన్ ఖాన్ మూడు నుంచి ఐదు రోజుల పాటు సమయం కేటాయించాల్సి ఉంటుందట. మూడు రోజుల్లోనే ఈ యాడ్ షూట్ పూర్తి అవుతుందట. స్థూలంగా మూడు రోజుల వ్యవధి షూటింగ్ కు సల్మాన్ ఖాన్ ఏడు కోట్ల రూపాయల పారితోషకాన్ని పొందుతున్నట్టున్నాడు!