బిగ్‌బాస్-3 విజేత , ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పబ్‌లో బీర్ సీసాలతో దాడి జరిగింది. అమ్మాయి విషయమే ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. బిగ్‌బాస్-3 షోలో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగు పెట్టిన రాహుల్…రోజురోజుకు అభిమానులను పెంచుకుంటూ వచ్చాడు.
బిగ్‌బాస్ షోలో పునర్నవితో రాహుల్ సాన్నిహిత్యం, తన పాట, ఆటలతో ఆకట్టుకున్నాడు. అలాగే ఓ కామన్ మ్యాన్‌ను రాహుల్‌లో చూసుకున్నారు. ఫైనల్లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి, రాహుల్ పోటీ పడ్డారు. చివరికి రాహుల్‌నే విజయం వరించింది.
తాజాగా హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న ఓ పబ్‌కు బుధవారం రాత్రి 11.45 గంటలకు తన స్నేహితులు, స్నేహితురాలితో రాహుల్ వెళ్లాడు. పబ్‌లో కొందరు యువకులు రాహుల్ వెంట వెళ్లిన యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో రాహుల్ వారిని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో రాహుల్ స్నేహితులు, ఆ యువకుల మధ్య మాటామాటా పెరిగింది. చివరికి భౌతిక దాడులకు దారి తీసింది.
ఆ యువకులు తమ చేతుల్లోని బీరు బాటిల్స్‌తో రాహుల్‌పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో రాహుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని గచ్చిబౌలిలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడ్డ యువకుల్లో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యో సోదరుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.