మెగాస్టార్ చిరంజీవి ని ఆకాశానికి ఎత్తేస్తున్నట్లుగా… ఆయన పెద్ద తమ్ముడు నాగేంద్రబాబు ఒక వీడియో విడుదల చేశారు. చిరంజీవి ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో తెలుగు ప్రజలకు తెలియ చెప్పడానికి అందులో చాలా కష్టపడి ప్రయత్నం చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, గుణ దోషాల గురించి తెలుగు ప్రజలకు తెలియదా అనేది సందేహం.
నాగబాబు చెబితే తప్ప తెలుసుకోలేని స్థితిలో తెలుగువాళ్లు లేరు. కానీ నాగేంద్ర బాబు వీడియో ప్రకటనను కాస్త లోతుగా గమనిస్తే మాత్రం ఆయన వ్యాఖ్యలు చిరంజీవికి పరువు నష్టం కలిగించేలా ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు నాగేంద్రబాబు వ్యక్తిగతం… అని చిరంజీవి కోటరీ ప్రకటిస్తే తప్ప వారి పరువు కాపాడు కోవడం కష్టం అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి అనే పదాలు సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికీ క్రేజ్ ఉండే విషయాలు. ఆయన చుట్టూ ఏ పుకారు అల్లినా నిమిషాల్లో అది వైరల్ అయిపోతుంది. అందుకే సోషల్ మీడియా క్రేజీ పోస్టులు కోరుకునేవారు… మెగాస్టార్ చుట్టూ కథలు అల్లుతారు.
నిన్న- ఆయన ఇంటి మీద ఆందోళనకారులు దాడికి ప్రయత్నిస్తారని చెప్పినా… ఇవాళ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం రానున్నదని కథలు ప్రచారంలో పెట్టినా సమస్త అందుకే. ట్విస్ట్ ఏమిటంటే… మెగాస్టార్ కోసం తన వాదనలు వినిపిస్తున్న బిల్డప్ తో ఇవాళ నాగేంద్రబాబు యూట్యూబ్ వీడియోని విడుదల చేయడం కూడా అలాంటి ప్రయత్నమే.
రాజ్యసభ సభ్యత్వం చుట్టూ రేగుతున్న పుకార్లకు వివరణ ఇవ్వడం వరకు ఓకే… కానీ చిరంజీవి రాజకీయ జీవితం గురించి చేసిన వ్యాఖ్యానాలు మాత్రం ఇబ్బందికరమైనవి. రాజకీయాల్లో తన కంటే పవన్ అద్భుతంగా ప్రజలకు సేవ చేయగలడని… చిరంజీవి అనుకున్నారని నాగబాబు అనుకున్నారు. ఎందుకంటే అలాంటి కామెంట్ ఎన్నడూ ప్రత్యక్షంగా చేయలేదు. అలా చెప్పడం అంటే… చిరంజీవి తన చేతకానితనాన్ని తానే స్వయంగా ఒప్పుకున్నట్లు అవుతుంది.
ఏ హీరో కూడా అలా చేయడు. పైగా అలా నమ్మడానికి పెద్ద ఆధారాలు కూడా లేవు. రాజకీయాల్లో చిరంజీవి సాధించిన విజయం తో పోలిస్తే… పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలు పిపీలకం కింద లెక్క. పవన్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలంటే తాను జనసేనలో ఉండకూడదని చిరు నిర్ణయించుకున్నారట… ఇది కూడా నాగ భాష్యమే!! ఆ వ్యాఖ్యలకు అర్థం ఏమిటి… చిరంజీవి ఎక్కడ ఉంటే ఆ పార్టీ దెబ్బతిని పోతుందా…. అలాగని నాగేంద్రబాబు సర్టిఫై చేస్తున్నారా… ఏమో ఈ వీడియో ప్రకటన చూసినప్పుడు అలాంటి అనేక సందేహాలు కలుగుతాయి.