ప్రభుత్వాలను కూల్చడానికి… ప్రభుత్వంలో ఉన్న పార్టీలను చీల్చడానికి… అనైతికమైన ఎత్తుగడలతో పావులు కదపడానికి రాజకీయ నాయకులు సిగ్గుపడే రోజులు ఎప్పుడో పోయాయి. ఓట్లు వేసిన ప్రజలు తమను ఛీత్కరించుకుంటారనే వెరపు ఎవ్వరికీ లేదిప్పుడు. తమకు అనుకూలంగా ప్రజల తీర్పు ఇవ్వకపోయినా, తమను ప్రతిపక్షంలోనే ఉండాల్సిందిగా ప్రజలు నిర్దేశించినా… వారికి ఖాతరు లేదు. ఎన్నికైన ప్రభుత్వాన్ని సమూలంగా కూల్చివేయడానికి… వారు నిస్సిగ్గుగా తమ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ నవీన పతనానికి ఎవరూ అతీతులు కాదు.
కేంద్రంలో అధికారం నీదా నాదా అని తలపడుతూ ఉండే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు రెండూ ఇప్పుడు అదే పని చేస్తున్నాయి. ఎవరికీ నీతి గల రాజకీయాలు అక్కరలేదు… అధికారం ఒకటే పరమావధి.
గుజరాత్ లో అతి కష్టం మీద మెజారిటీని సాధించి ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్ తన వంతు కృషి చేస్తోంది. అదే సమయంలో తమ చేతి నుంచి పరిపాలనను హస్తగతం చేసుకున్న, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి భారతీయ జనతా పార్టీ క్యాంపు రాజకీయాలు నడుపుతోంది. ఇలా ఈ రెండు పార్టీలు కూడా ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుంటున్నారు.
గుజరాత్ లో డిప్యూటీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 20 మంది భాజపా ఎమ్మెల్యేలను తన వెంట బయటకు తీసుకు వస్తే గనుక…. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పేర్కొన్నది. మరొకవైపున మధ్యప్రదేశ్ లో అంతకంటే కనిష్టమైన అత్తెసరు మెజారిటీతో… కాంగ్రెస్ ప్రభుత్వం అతుకుల బొంత గా ఏర్పడి ఉంది. దానిని కూల్చడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. పైగా అక్కడ ఏడుగురు సభ్యులను మభ్యపెడితే చాలు. రెండు పార్టీల నడుమ ఇలాంటి కుట్ర రాజకీయాలు.. శృతి మించుతున్నాయి. ప్రజల తీర్పును కాలరాసి, ఇలాంటి కుయుక్తుల ద్వారా అధికారంలోకి వస్తే… ప్రజలు అసహ్యించుకుంటారనే భయం వారికి లేకుండా, బరితెగింపు తనం కనిపిస్తోంది..!!