ప్రెవేటు జూనియర్ కాలేజీలు ఇక ఇష్టారాజ్యంగా దోచుకోవడం కుదరదు. విద్యార్థులను సంతలో పశువుల్లాగా పరిగణించడం కూడా కుదరదు. జూనియర్ కాలేజీల అనేకానేక దురాగతాలకు చెక్ పెట్టే విధంగా జగన్ సర్కారు కొత్త నిర్ణయాలను తీసుకువస్తున్నది. ఈ ఏడాదినుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. అడ్మిషన్ల దశనుంచే సంస్కరణలు వస్తాయి. అవి కార్యరూపంలోకి వస్తే ఇంటర్మీడియట్ కాలేజీల దోపిడీ చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.
ఇంజనీరింగ్ కాలేజీల తరహాలో జూనియర్ కాలేజీలకు కూడా ప్రభుత్వమే ఫీజులను నిర్ణయించనుంది. ప్రభుత్వమే ఫీజులను నియంత్రిస్తుంది. ప్రధానంగా ప్రెవేటు జూనియర్ కళాశాలలు రకరకాల కోచింగ్ ప్యాకేజీల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులను డొనేషన్లను వసూలు చేస్తూ దోచుకుంటున్న పద్ధతికి ఇది అడ్డుకట్ట వేస్తుంది. అడ్మిషన్లను పూర్తిగా ఆన్ లైన్ విధానంలోకి మారుస్తున్నారు.
పదోతరగతిలో తమకు లభించిన మార్కులను బట్టి.. విద్యార్థులు తమ ఇంట్లోనుంచే ఇంటర్ అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే కాలేజీలో సీట్లకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే మాత్రం.. పదోతరగతిలో మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. ఆయా కాలేజీలకు ఫీజులను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది గనుక.. దరఖాస్తు చేస్తున్న సమయంలోనే ఆ కాలేజీల ఫీజుల వివరాలు కూడా కంప్యూటరు స్క్రీనుపై కనిపిస్తాయి గనుక.. విద్యార్థులు ఆయా ఫీజులు చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి విద్యార్థికి అయిదారు కాలేజీలకు ఆప్షన్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల దోపిడీ సమూలంగా ఆగిపోతుందని అనలేం గానీ… గరిష్టంగా అడ్డుకట్టపడే అవకాశం ఉంది.
మరో గొప్ప ఏర్పాటు ఏంటంటే.. రిజర్వేషన్లు కూడా యథాతథంగా అమలు కాబోతున్నాయి. అంటే ప్రెవేటు కాలేజీల్లో కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయన్నమాట. విద్యార్థులను దోచుకోవడానికి ప్రెవేటు జూనియర్ కళాశాలలు అనుసరించే అనేక పద్ధతులకు దెబ్బ పడుతుంది. ఇక వారు తమ దోపిడీ కొనసాగడానికి కొత్త మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుంది.