సామాన్యుల బ‌తుకుల‌ లోతుల్లోకి దిగుతున్న జ‌గ‌న్!

ఏపీ రాజ‌కీయానికి సంబంధించి పై పై విశ్లేష‌ణ‌లు ఎన్ని సాగించినా, అస‌లు విష‌యాల‌ను చాలా మంది విస్మ‌రిస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజ‌యాన్ని, తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైఎస్ఆర్…

ఏపీ రాజ‌కీయానికి సంబంధించి పై పై విశ్లేష‌ణ‌లు ఎన్ని సాగించినా, అస‌లు విష‌యాల‌ను చాలా మంది విస్మ‌రిస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజ‌యాన్ని, తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజ‌యాన్ని త‌క్కువ చేసి చూపే విశ్లేష‌ణ‌ల‌ను ఎన్నో చేయ‌వ‌చ్చు! తెలుగుదేశం పార్టీ ప‌తాన‌వ‌స్థ‌ను ఎలాగైనా స‌మ‌ర్థించ‌వ‌చ్చు. 

స్థానిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిందంటే, దాని ప్ర‌భావం అధికారం అని, తిరుప‌తిలో వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ వ‌చ్చిందంటే ప్ర‌జ‌లు మొహ‌మాటం కొద్దీ ఓటేశార‌నో, దొంగ ఓట్లు అనో, ఐదు ల‌క్ష‌ల‌కు పై మెజారిటీ రాలేదు క‌దా.. అనే వ్యంగ్యాన్నో వ్య‌క్త ప‌ర‌చ‌డం క‌ష్టం ఏమీ కాదు. ఇవ‌న్నీ ఈజీనే. చిటికెల పందిరి వేసిన‌ట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యాల‌ను చాలా తేలిక చేయ‌వ‌చ్చు. 

జ‌గ‌న్ పాల‌న‌ను ఈజీగా త‌ప్పు ప‌ట్ట‌వ‌చ్చు. ఎలాంటి వ్య‌క్తి పాలించినా కొన్ని లోటు పాట్లు ఉండ‌నే ఉంటాయి. మ‌హామ‌హుల‌కే అది త‌ప్ప‌లేదు. అలాగే జ‌గ‌న్ పాల‌న‌లో కూడా కొన్ని లోటు పాట్లు ఉండ‌వ‌చ్చు. జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థులు అనుకునేది ఏమిటంటే.. ఆ లోటు పాట్లే జ‌గ‌న్ ను ముంచేస్తాయ‌నేది! త‌మ‌ను గెలిపిస్తాయ‌నే భ్ర‌మ‌ల్లో ఉన్నారు. అయితే ఒక ప్ర‌భుత్వాన్ని దించేయాలి, మ‌రో ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెనెక్కించాలి అంటే.. రాజ‌కీయ ప‌రిస్థితులు వేరేగా ఉండాలి. 

జ‌గ‌న్ పై ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు చేసే విమ‌ర్శ‌లు, విశ్లేష‌కులు ప్ర‌స్తావించే అంశాల్లో.. డెప్త్ లేదు! జ‌గ‌న్ పాల‌న రెండేళ్ల‌ను పూర్తి చేసుకుంటున్న త‌రుణంలో కూడా బ‌ల‌మైన కాజ్ ఏదీ ప్ర‌త్య‌ర్థుల‌కు దొర‌క‌డం లేదు.

ఇక ఇదే స‌మ‌యంలో క్షేత్ర స్థాయిల్లోకి వెళ్లి చేస్తూ.. జ‌గ‌న్ ప‌థ‌కాలు మాత్రం లోతుల‌కు దిగుతున్నాయి.  అవి సూటిగా సామాన్యుడిని చేరుతున్నాయి. అవ‌స‌రం అయిన వాడికి అవ‌స‌ర‌మైన‌వి అందుతున్నాయి! బ‌హుశా ప్ర‌భుత్వాల నుంచి ప్ర‌జ‌లు ఇంత క‌న్నా ఎక్స్ పెక్ట్ చేసేది ఏమీ లేదు. ఎక్స్ పెక్ట్ చేస్తున్న దానికి మించి జ‌గ‌న్ పాల‌న లో ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయి. ప్ర‌జ‌లు చూసేది అదొక్క‌టీ మాత్ర‌మే!

క‌రోనా క‌ష్టాల వేళ కూడా జ‌గ‌న్ ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ ఉన్నారు. రాయ‌ల‌సీమ ప‌ల్లెల్లో అయితే ప్ర‌భుత్వం ల‌బ్ధి పొంద‌ని వ‌ర్గం అంటూ ఏదీ లేకుండా పోయింది. ఇప్పుడు ప‌ల్లెల్లో బోర్లు వేస్తున్నారు. అనేక మంది రైతులు వాటి ల‌బ్ధి పొందుతున్నారు. త‌మ‌కు బోరు వేయించి, వ్య‌వ‌సాయానికి నీళ్ల‌ను అందించే పాల‌కుడిని ఏ రైతు కూడా మ‌రిచిపోడు! ఇది ఎంతో ప‌దునైన సెంటిమెంట్. జ‌గ‌న్ అదృష్టం ఏమిటంటే.. రాయ‌ల‌సీమ‌లో మండు వేస‌విలో వేయిస్తున్న బోర్ల‌లో కూడా జ‌ల‌ధార క‌డుతోంది! ప‌ది బోర్లు వేస్తే ఏడెనిమిది వ‌ర‌కూ స‌క్సెస్ రేటు క‌నిపిస్తోంది. 

బోర్ల మీద వ్య‌వ‌సాయం జరిగే రాయ‌ల‌సీమ‌లో ఇంత స‌క్సెస్ రేటు అంటే అది సామాన్య‌మైన‌ది కాదు. గ‌త ఏడాది పుష్క‌ల‌మైన వ‌ర్షాలు కుర‌వ‌డం, హంద్రీనీవాతో అనంత‌పురం వంటి జిల్లాలో చాలా చెరువులు నిండ‌టంతో భూగ‌ర్భ‌జ‌ల స్థాయి గ‌ణ‌నీయంగా పెరిగింది. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ఉచిత బోర్లు ఊరూరా ప‌డుతున్నాయి. అనేక మంది రైతుల‌కు ఈ జ‌ల‌వ‌న‌రులు అందుతున్నాయి. దీంతో వాళ్ల సంతోషం అలాగిలాగా లేదు!  ఇలా వారి సంతోషంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరు భాగం అవుతోంది. 

ఫ్రీ బోర్లు, జ‌గ‌న్ బోర్లు.. జ‌ల‌వ‌న‌రుల‌ను కురిపిస్తున్నాయి. ఉచిత క‌రెంటుతో వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డికి ఎంత పేరు వ‌చ్చిందో, ఇప్పుడు ఉచిత బోర్ల‌తో రైతుల్లో జ‌గ‌న్ ఇమేజ్ అంత‌కు మించి పెరుగుతోంది. ఈ రోజుల్లో ఒక బోర్ వేసి, పంపు-మోట‌ర్ బిగించుకోవాలంటే ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల వ్య‌యంతో కూడుకున్న ప‌ని.

ఆ మాత్రం సాహ‌సానికి రైతులు రెడీ అయినా, నీళ్లు ప‌డ‌తాయో, ప‌డ‌వో అనే భ‌యం ఉండ‌నే ఉంటుంది. ఇప్పుడు ప్ర‌భుత్వ‌మే ఉచిత బోర్ వేయిస్తూ ఉండ‌టంతో.. రైతులకు ప్ర‌త్యేకంగా సాహ‌సం చేయాల్సిన అవ‌స‌రం లేదు. పొలం ఉంటుంది, బోరు వేయించుకోవ‌డానికి ధైర్యం ఉండ‌దు. నీరు ప‌డ‌తాయో ప‌డ‌వో అనే అప‌న‌మ్మ‌కంతో ఆగిపోయిన వాళ్ల‌కు ఇప్పుడు ఉచిత బోర్ల ప‌థ‌కంతో కొత్త ఊప‌రి అందుతోంది. 

క‌ష్ట‌మోన‌ష్ట‌మో ప్ర‌భుత్వ‌మే  భ‌రిస్తోంది కాబ‌ట్టి రైతులు రెడీ అంటున్నారు. జియోలాజిస్టులు పెట్టిన పాయింట్ల‌తో వేస్తున్న బోర్ల స‌క్సెస్ రేటు బ్ర‌హ్మాండంగా ఉంది. దీంతో ఈ ప‌థ‌కం గ్రాండ్ స‌క్సెస్ గా నిలుస్తోంది. నీళ్లు ప‌డిన రైతుల‌కు ప్ర‌భుత్వ‌మే ఉచితంగా మోట‌ర్- పంపును కూడా అందించ‌నుంది. దీంతో రైతుల కుటుంబాలకు ఇంత‌క‌న్నా మ‌రే అవ‌స‌రం లేకుండా పోతోంది. అయితే ఈ ప‌థ‌కంలో కొన్ని ష‌ర‌తులు అంద‌రినీ ల‌బ్ధిదారుల‌ను క‌లిగించ‌లేక‌పోతున్నాయి.  

ద‌గ్గ‌ర్గో ఆల్రెడీ నీళ్లు ఇస్తున్న బోర్లు ఉంటే.. దానికి స‌మీపంలో కొత్త బోర్లు వేయ‌డం లేదు. దీని వ‌ల్ల కొంత మంది రైతులు అన‌ర్హులు అవుతున్నారు. అయితే అర్హ‌త పొంది, నీళ్లు పొందుతున్న రైతుల పాలిట మాత్రం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూప‌ర్ హీరో అవుతున్నారు. రాయల‌సీమ‌లోని చాలా ప‌ల్లెల్లో ఇప్ప‌టికే బోర్ల త‌వ్వ‌కాలు మొద‌ల‌య్యాయి. రానున్న రెండేళ్ల‌లో ఈ ప‌థ‌కం ప్ర‌భావం రైతాంగంపై గ‌ణ‌నీయంగా ఉండ‌నుంది!