ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఎప్పుడూ రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఒకటి తెలుగుదేశం అనుకూల మీడియా చూపించేది, రెండోది అసలైనది -వాస్తవమైనది. తెలుగుదేశం అనుకూల మీడియా దశాబ్దాల ప్రస్థానంలో తన ఉనికిని ఏర్పరుచుకుంది. తాము ఏం చెబితే అదే నిజం అనే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంది. తాము నంది అంటే నంది, పంది అంటే పంది అని.. ప్రతి విషయం గురించి ప్రజలను భ్రమలకు గురి చేయడానికి ఈ మీడియా వర్గం అవిశ్రాంతంగా పని చేస్తూ ఉంటుంది.
గోబెల్స్ సిద్ధాంతం ఆధారంగా ఈ మీడియా వర్గం పని చేస్తూ ఉంటుంది. రెండు పత్రికలు, అరడజనుకు పైగా వార్తా చానళ్లు ఈ బృందంలో ఇప్పటికీ ఉన్నాయి. ఎంతసేపూ చంద్రబాబుకు జాకీలు వేసి లేపడం, ప్రత్యర్థులను తక్కువ చేసి చూపడమే వీటి పని. ఒక సామాజికవర్గం చేతిలోని ఈ మీడియా సంస్థలు చంద్రబాబు ప్రత్యర్థులపై అనునిత్యం బురద జల్లుతూనే ఉంటాయి. అది నిజం అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రయత్నంలో ఇవి విజయవంతం అయిన సందర్భాల కన్నా, ఫెయిల్యూర్ అయిన సందర్భాలే ఎక్కువ!
గత 20 సంవత్సరాల పరిస్థితులను గమనిస్తే.. 2004, 09 ఎన్నికల్లో టీడీపీతో పాటు దాని అనుబంధ మీడియా కూడా ఓటమి పాలయ్యింది. ఆ రెండు సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడని, టీడీపీ విజయం సాధిస్తుందని ప్రజలను నమ్మించడానికి ఈ మీడియా వర్గాలు తీవ్రంగా శ్రమించాయి. వైఎస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ కు ఓటమి తప్పదని ఢముకు వేశాయి. అయితే.. వీళ్లు ఎంతగా ఊదరగొట్టినా ప్రజలు మాత్రం వీరి ప్రచారాన్ని ఆ రెండు సందర్భాల్లో సీరియస్ గా తీసుకోలేదు.
టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారు. ఇక 2014 నాడు కూడా పచ్చ మీడియా యథాశక్తి అవిశ్రాంతంగా పని చేసింది. అప్పుడు ఈ మీడియా సాయం చంద్రబాబు కొంత ఉపయోగపడింది. జగన్ పచ్చమీడియా సాగించిన అవిశ్రాంత ప్రచారం ఒకటీ రెండు శాతం ఓట్లను ప్రభావితం చేసి ఉండొచ్చు. అయితే దాని కన్నా 2014లో టీడీపీ గెలుపులో ప్రధాన కారణం కాంగ్రెస్ మార్కు పాలనపై ఏర్పడిన వ్యతిరేకత, మోడీ గాలి, పవన్ కల్యాణ్ మద్దతు. పచ్చమీడియా కృషి కన్నా ఈ కారణాలే టీడీపీని గెలిపించాయి అనేది సత్యం.
అయితే తాము ప్రజలను ప్రభావితం చేయగలమని మరోసారి పచ్చమీడియా నమ్మింది. 2014 నుంచి 19 వరకూ ఆ భ్రమలకే లోనయ్యింది. చంద్రబాబుకు మళ్లీ అవిశ్రాంతంగా జాకీలేసింది. చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ 2019 ఏప్రిల్ ఒకటో తేదీన పచ్చపత్రిక ఒకటి స్వామీజీల జోస్యాలంటూ ఢంకా భజాయించింది. వారితో పాటు తను కూడా ఏప్రిల్ ఫూల్ అయ్యింది.
ఇక ప్రస్తుతానికి వస్తే.. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కూడా సహజంగా పచ్చమీడియా తక్కువ చేసి చూపిస్తూ ఉంది. దొంగ ఓట్ల వల్ల మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిందంటూ తమ మార్కు ప్రచారాన్ని చేస్తోంది. అయితే ప్రతి పోలింగ్ బూత్ లోనూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న ఎన్నికలో దొంగ ఓట్లు ఎలా సాధ్యం అవుతాయి? అనే ప్రాథమిక విషయాన్ని ప్రజలు ఆలోచించరు అనేది, టీడీపీ మీడియా భ్రమ.
ఇలాంటి భ్రమలకు లోనయ్యే చంద్రబాబు ఓటమికి పచ్చ మీడియా కూడా పదే పదే కారణం అవుతూ ఉంది. అధికారంలో ఉన్న వేళ కానీ, అధికారంలో లేకపోయినప్పడు కానీ.. వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పడం అటుంచితే, కనీసం చంద్రబాబుకు కూడా తెలియజేయవు పచ్చ పత్రికలు. చంద్రబాబును భ్రమల్లోనే ఉంచి, ఆయనను ఓటమి ముఖద్వారాలకు తీసుకెళ్తున్నాయి పచ్చ పత్రికలు.
చంద్రబాబుకు సేవలు చేయడానికి తెగ పరి తపించే ఈ కుల మీడియా, ఆ సేవలు చేస్తున్న భ్రమల్లో చాలా నష్టం కూడా చేస్తోంది. చంద్రబాబుకు జాకీలు వేస్తున్నామనుకుని ఆయన బండిని తలకిందులు చేస్తున్నాయి పచ్చ మీడియా వర్గాలు. అధికారంలో ఉన్నప్పుడు అయినా, లేకపోయినప్పుడు అయినా పచ్చమీడియా చంద్రబాబుకు నష్టమే చేస్తోంది తప్ప లాభం చేకూర్చడం లేదు.
అయితే చంద్రబాబుకు తెలిసిన సూత్రం మాత్రం మీడియా మేనేజ్ మెంట్ మాత్రమే! మీడియాను మేనేజ్ చేసి తొలి సారి అధికారం, సీఎం సీటును పొందిన వ్యక్తి కావడంతో తనను కాపాడేది మీడియా మాత్రమే అని చంద్రబాబు నాయుడు బలంగా నమ్ముతున్నట్టుగా ఉన్నారు.
గత 20 యేళ్లలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నెగ్గింది ఒక్కటంటే ఒక్కసారే! ఇప్పుడు ఆ పార్టీ తన చరిత్రలోనే అత్యంత పతానవస్థను ఎదుర్కొంటూ ఉంది. అయినా చంద్రబాబు నాయుడు వ్యూహాలు పచ్చమీడియా మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ టీడీపీ రాజకీయ పతనానికి దారి తీస్తున్నాయని మాత్రం సగటు రాజకీయ అవగాహన కలిగిన పౌరుడికి కూడా అర్థమవుతూనే ఉంది.