జ‌గ‌న్‌ను నెత్తికెత్తుకోని వైసీపీ సోష‌ల్ మీడియా

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ట్వీటాడినా, మాట్లాడినా నెత్తికెత్తుకుని వైర‌ల్ చేసే వైసీపీ సోష‌ల్ మీడియా …ఈ ఒక్క విష‌యంలో మాత్రం ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌లేదు. పైగా వైసీపీ శ్రేణులు, సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు నిన్న‌టి ట్వీట్‌పై…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ట్వీటాడినా, మాట్లాడినా నెత్తికెత్తుకుని వైర‌ల్ చేసే వైసీపీ సోష‌ల్ మీడియా …ఈ ఒక్క విష‌యంలో మాత్రం ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌లేదు. పైగా వైసీపీ శ్రేణులు, సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు నిన్న‌టి ట్వీట్‌పై కాస్త నొచ్చుకున్న‌ట్టే క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ట్వీట్‌పై స్పందించ‌డం దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ ట్వీట్‌పై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతి నేప‌థ్యంలో ప‌లువురు ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి ప‌రిస్థితుల‌ను ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా జార్ఖండ్ సీఎం హేమంత్‌ సొరేన్‌తో కూడా ప్ర‌ధాని మాట్లాడారు. మోదీతో మాట్లాడిన అనంత‌రం జార్ఖండ్ సీఎం ఓ ట్వీట్ చేశారు.

‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయన తన ‘మన్‌ కీ బాత్‌’ మాత్రమే చెప్పారు. కాస్త ఉపయోగపడే విష యాలు చెప్పి, మేం చెప్పేదీ విని ఉంటే బాగుండేది’ అని ట్వీట్ చేశారు. ఇందులో పెద్ద‌గా త‌ప్పు ప‌ట్టాల్సిన అంశం కూడా ఏమీ లేదు. మేం చెప్పేది కూడా విని ఉంటే బాగుండేద‌ని త‌న అభిప్రాయాన్ని ట్విట‌ర్ వేదిక‌గా సోరెన్ చెప్పారు. ఎందుక‌నో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వెంట‌నే స్పందించారు.

‘మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, ఒక సోదరుడిగా ఒక విన్నపం చేస్తున్నాను. మన మధ్య ఎటువంటి విభేదాలైనా ఉండొచ్చు. కానీ, ఇలాంటి రాజకీయాలు మన సొంత దేశాన్ని బలహీనపరుస్తాయి. ఇది కొవిడ్‌పై యుద్ధం జరుగుతున్న సమయం. ఇలాంటప్పుడు ఒకరిని వేలెత్తి చూపించే బదులు… మనమంతా కలిసి కొవిడ్‌పై సమర్థంగా యుద్ధం సాగించేలా ప్రధానమంత్రిని బలోపేతం చేయాలి’ అని హేమంత్‌ సొరేన్‌కు జ‌గ‌న్‌ సూచించారు.

ఇప్పుడీ ట్వీటే జ‌గ‌న్‌ను ట్రోలింగ్‌కు గురి చేస్తోంది. దేశంలో క‌రోనా సెకెండ్ వేవ్‌కు ప్ర‌ధాన కార‌ణం మోదీ నేతృత్వంలో కేంద్ర స‌ర్కార్ అల‌స‌త్వం, అస‌మ‌ర్థ‌తే కార‌ణ‌మ‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకున్న మోదీని జ‌గ‌న్ స‌మ‌ర్థించ‌డం ప్ర‌త్య‌ర్థుల‌కు ఓ ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. మీరు ఎలాగూ ప్ర‌శ్నించ‌రు, ప్ర‌శ్నించే వాళ్ల‌కు హిత‌వు చెప్ప‌డం మీకు మాత్ర‌మే చెల్లుతుంద‌నే విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున చెల‌రేగుతున్నాయి.

ముఖ్యంగా జ‌గ‌న్ ట్వీట్‌పై ఒడిసాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ స‌ప్త‌గిరి ఉలాకా ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

‘వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వంటి ఉన్నతమైన నాయకుడి కుమారుడు సీబీఐ భయంతో మోదీకి తందాన తాన అనడం విచారకరం. కొంచెం ఎదగండి! మీరిప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి’ అని ఘాటు రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉంటే మోదీని సమర్థిస్తూ జ‌గ‌న్ చేసిన ట్వీట్‌ను వైసీపీ సోష‌ల్ మీడియా మ‌రీ నెత్తికేసుకుని ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. దీన్ని బ‌ట్టి జ‌గ‌న్ ట్వీట్‌పై సొంత శ్రేణుల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

అంతేకాదు, శాంతాబ‌యోటెక్ వ్య‌వ‌స్థాప‌కుడు వ‌ర‌ప్ర‌సాద్‌రెడ్డి ఇటీవ‌ల ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతికి కేంద్ర ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ‌త‌, రాజ‌కీయ స్వార్థం ఎలా కార‌ణ‌మ‌య్యాయో చెప్పిన సంగ‌తులు వైర‌ల్ అవుతున్నాయి. ఇలాంటి పాల‌కుల‌ను చ‌రిత్ర క్ష‌మించ‌ద‌ని ఆయ‌న చెప్ప‌డం యావ‌త్ తెలుగు స‌మాజాన్ని ఆలోచింప‌జేస్తోంది. 

ఒక్క మాట‌లో చెప్పాలంటే మోదీ స‌ర్కార్ త‌ప్పుల‌పై ఆయ‌న చెడుగుడు ఆడారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మోదీని స‌మ‌ర్థిస్తూ , సాటి ముఖ్య‌మంత్రి ట్వీట్‌పై జ‌గ‌న్ ప్ర‌తికూల ట్వీట్ చేయ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.