బోలెడన్ని బేధాభిప్రాయాలతో కూడా కాపురాలను కొనసాగించడం భారతీయుల ప్రత్యేకత. బహుశా ప్రపంచంలోని ఏ దేశంలో ఇంత అన్యోన్యత ఉండదేమో! పరస్పర ఏకాభిప్రాయాలు ఏ ఒక్క అంశంలోనూ లేపోయినా జంటగా సాగడం మనోళ్లకే సాధ్యం అవుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్లు చూసి చేసే పెళ్లిళ్లలో వాళ్లు ఆలోచించే సాపత్యాల్లో పరిమితమైనవి మాత్రమే సుదీర్ఘ దాంపత్య బంధాన్ని కొనసాగించగలవు.
మతం, కులం, గోత్రం.. ఇవి పెద్దలు ప్రాథమికంగా పరిశీలించేవి. అయితే ఈ మూడూ కూడా దాంపత్యంలో ఎంత వరకూ వ్యక్తిగత సంతోషాన్ని ఇస్తాయో చెప్పలేం. తమ కులం అమ్మాయినే లేదా అబ్బాయినే చేసుకోవడంలో ఉండే తృప్తి ఎవరికి వారికి వేరే కావొచ్చు. అయితే రోజులు మారాయి. తమ కులం పార్ట్ నర్ నే ఎంచుకుని ప్రేమించే వాళ్లు ఎంతో మంది ఉంటారు. అలాగే కులాంతర ప్రేమలూ, వివాహాలు కూడా జరుగుతున్నాయి.
అలాగే పెద్దలు చూసి చేసే పెళ్లిళ్ల సంఖ్య కూడా గణనీయంగా ఉన్నాయి. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లలో ఆర్థిక కోణం కూడా ప్రముఖంగా ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. వివాహంలో సర్దుకుపోయే విషయాలు ఎన్నో ఉంటాయి. మరి ఇలాంటి నేపథ్యంలో.. ప్రేమ పెళ్లిలో అయినా, పెద్దలు కుదిర్చే పెళ్లిలో అయినా.. యువతీయువకులు ముందస్తుగా మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్ పర్ట్స్. అవేమిటంటే..
డబ్బు గురించి..
ముందుగా మాట్లాడుకోవాల్సిన అంశం డబ్బు, దాని గురించి పరస్పర అభిప్రాయాలు, ప్రాధాన్యతలు అని నిపుణులు చెబుతున్నారు. అవతలి వారు స్పెండరా, సేవరా.. అనే అంశం పెళ్లికి ముందే తెలుసుకోవాలి. అలాగే జాయింట్ అకౌంట్ ను మెయింటెయిన్ చేయడమా, ఎవరి అకౌంట్లు వారివేనా అనే అంశాల గురించి కూడా ముందే తేల్చుకోవడం మంచిది.
కాపురంలో అయ్యే ఖర్చులు ఎవరు పెట్టాలి, ఎంత పెట్టాలి.. అనే అంశాలపై కూడా అమ్మాయి, అబ్బాయి ఒక మాట అనేసుకోవడం మంచిది. మరి వివాహం అంటే.. ఇలాంటి ఫైనాన్షియల్ డీలింగ్ నా? అనే ప్రశ్న రావొచ్చు. అయితే.. పెళ్లి తర్వాత ఇలాంటి విషయాల్లో గొడవలు పడి, మనసులను నొప్పించుకునే వాళ్లు, నొచ్చుకునే వాళ్లు బోలెడంత మంది ఉంటారు. అలాంటి పరిస్థితి కన్నా ముందే ఈ అంశాల గురించి మాట్లాడుకోవడం మంచిదనేది నిపుణుల మాట.
సెక్స్..
ఈ విషయం వేరే చెప్పనక్కర్లేదు. సుదీర్ఘ కాలం పాటు ప్రేమలో ఉండే వారి మధ్యన అయితే ఆటోమెటిక్ గా శృంగారం గురించి ఎప్పుడో ఒకప్పుడు ప్రసక్తి రానే వస్తూ ఉంటుంది. అదే పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లలో వివాహానికి ముందు సెక్స్ గురించి మాట్లాడుకోగలిగే వారు తక్కువ మందే కావొచ్చు. అయితే ఈ విషయం గురించి మాట్లాడుకోవడం అనేంత మెచ్యూరిటీ అవసరం ఈ రోజుల్లో.
పెళ్లి అయిన వెంటనే చెరో చోట పనులకు వెళ్లిపోయే వారు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం అంటే లాక్ డౌన్ రోజులు. లేకపోతే.. ఉద్యోగ రీత్యా ఎడబాటును ఎదుర్కొనే వాళ్లు ఉంటారు. ఇలాంటి పరిస్థితులను ఎలా డీల్ చేయాలి, సెక్స్ పట్ల పరస్పర అభిప్రాయాలు ఏమిటనేవి తెలుసుకోవడం మంచిదే. అయితే ఈ విషయంలో మరీ సూటిగా కాకుండా.. రొమాంటిక్ గా మాట్లాడుకునే అవకాశం ఎలాగూ ఉండనే ఉంటుంది!
పర్సనల్ స్పేస్..
ఎంత పెళ్లి అయినా ఎంత సేపూ ఒకరికి ఒకరు మాత్రమే సమయం కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు. సాధ్యం కాదు కూడా. వ్యక్తిగత అభిరుచులు, ఆసక్తులు ఉండనే ఉంటాయి. సినిమాలు, పుస్తకాలు, షాపింగ్.. ఇలాంటి విషయాల్లో వేర్వేరు అభిప్రాయాలూ, అభిరుచులు వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. వీటి గురించి కూడా ముందే తెలుసుకోవడం మంచిది.
అప్పుడే ఒక క్లారిటీకి రావొచ్చు. తీరా పెళ్లయ్యాకా ఇలాంటి విషాయాల్లో విబేధించుకోవడం కన్నా.. ముందే క్లారిటీని కలిగి ఉండటం గొప్ప విషయం అవుతుంది. ఇక పిల్లలు, మతసంబంధ నమ్మకాలు,ఆ విశ్వాసాల్లోని గాఢత, మీరు మీరు మార్చుకోవాలి అనుకుంటున్నది, ఉద్యోగానికి కేటాయించే సమయం, తల్లిదండ్రులను, తోబుట్టువులను ఎలా ట్రీట్ చేసుకునే అంశాల గురించి కూడా పెళ్లికి ముందే మాట్లాడుకోవడం మంచిది.
ఎలాగూ కలిసి సాగించే జీవనంలో ఎన్నో కొత్త ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. వాటిని ఎలాగూ నివారించలేకపోయినా.. కీలకమైన అంశాల గురించి ముందే మాట్లాడుకోవడం మాత్రం ఎంతో కొంత తెలివైన వాళ్ల పనే!