జాతీయం..ప్రాంతీయం..కులం

దాదాపు సార్వత్రిక ఎన్నికల పోరును తలపిస్తూ సాగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. సహజంగానే ఫలితాలు కొన్ని పాఠాలు చెబుతాయి. లేదా కొన్ని వాస్తవాలు వెల్లడిస్తాయి. కొన్ని కఠోర సత్యాలు ప్రకటిస్తాయి. ఈ ఎన్నికలు…

దాదాపు సార్వత్రిక ఎన్నికల పోరును తలపిస్తూ సాగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. సహజంగానే ఫలితాలు కొన్ని పాఠాలు చెబుతాయి. లేదా కొన్ని వాస్తవాలు వెల్లడిస్తాయి. కొన్ని కఠోర సత్యాలు ప్రకటిస్తాయి. ఈ ఎన్నికలు కూడా అదే పని చేసాయి. బెంగాల్, తమిళనాడు ఎన్నికలను దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు ఆసక్తితో తిలకించారు.

తమ రాష్ట్రాల్లో తృణమోల్ కాంగ్రెస్ లేకపోయినా, గెలవాలని కోరుకున్నారు. నిజానికి తృణమూల్ కాంగ్రెస్ తో పెద్దగా పరిచయం లేని వారు సైతం బెంగాల్ లో దీదీ గెలవాలని కోరుకున్నారు. మోడీ అండ్ కో కలిసి బెంగాల్ లో ఓ ఆడదానిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫీలయ్యారు. 

అదే టైమ్ లో కేవలం ఎన్నికల కోసం దేశాన్ని, జనాభాన్ని కరోనాకు వదిలేసారని జనం భావించారు. మోడీకి తెలిసి జరిగినా తెలియక జరిగినా అంబానీ, ఆదానీల టేకోవర్ దందాల వెనుక ఆయనే వున్నారని జనం విశ్వసించారు. వీటన్నంటి ఫలితంగా బెంగాల్ లో భాజపాకు ఎదురుదెబ్బ తగలాలని కోరుకున్నారు. అలా అయితేనే భాజపా దూకుడుకు ముకుతాడు వేయడం సాధ్యమవుతుంది అనుకున్నారు.

బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా దీదీ అదే అన్నారు. బెంగాల్ ప్రజలు భాజపా నుంచి దేశాన్ని కాపాడారు అని స్టేట్ మెంట్ ఇచ్చేసారు. దీదీ ప్రకటన కాస్త మరీ అతిగా అనిపించొచ్చు కానీ అందులో కొంతయినా వాస్తవం వుంది. బెంగాల్ లో కనుక భాజపా గెలిచి వుంటే మళ్లీ మరో ఎన్నిక అంటూ వచ్చే వరకు మోడీ అండ్ కో దూకుడుకు పగ్గాలు వుండేవి కావు. నిజానికి మోడీ మీద అంత భయంకరమైన వ్యతిరేకత లేకపోయినా, కొద్దిగానైనా పగ్గాలు వుండాలనే బెంగాల్ లో భాజపా ఓటమిని కోరుకున్నారు.

ఆ సంగతి అలా వుంచితే బెంగాల్, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఎప్పటికీ లోకల్ పార్టీలే అధికారం సాధిస్తూ వుంటాయని ఓ క్లారిటీ వచ్చింది. నార్త్ లోని పలు రాష్ట్రాల్లో కూడా భాజపా నేరుగా అధికారంలోకి వస్తుందనే నమ్మకం రాను రాను సన్నగిల్లుతోంది. భాజపా సంగతి అలా వుంచితే మరో జాతీయపార్టీ కాంగ్రెస్ దాదాపు కనుమరుగయ్యే స్థితిలోకి చేరకుంటోంది. 

భాజపాకు అయినా మెరుగయ్యే ఆశలు, చాన్స్ లు వున్నాయేమో కానీ కాంగ్రెస్ కు అలాంటి సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ రెండు జాతీయ పార్టీలను పక్కన పెడితే వామపక్షాలు అయితే మరీ కూనారిల్లిపోయాయి. రెండు దశాబ్దాలకు పైగా అధికారం ఇచ్చిన బెంగాల్ ప్రజలు ఆ పార్టీలనే పూర్తిగా మరిచిపోయారు. చాలా రాష్ట్రాల్లో పరాన్న జీవుల్లా మారిపోయిన ఎర్రపార్టీలను ప్రజలు దాదాపు పక్కన పెట్టేసారు.

ఇలాంటి నేపథ్యంలో అవలోకిస్తుంటే ఇక జాతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందని అనిపిస్తోంది. కాంగ్రెస్ మినహా మరే జాతీయ పార్టీ దేశంలో స్వంతంగా అధికారం చేపట్టడం అసాధ్యమయింది ఒకప్పుడు. అలాంటి టైమ్ లోనే జనతా ప్రయోగం అవసరం పడింది. ఒక విధంగా సంకీర్ణ ప్రభుత్వాలకు అది నాంది. కానీ రాజకీయాల్లో కలయికలు శాశ్వతం కాకపోవడంతో జనతా ప్రయోగం విఫలమైంది. 

అప్పటి నుంచి భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందిన జనసంఘ్ పార్టీ స్వంతంగా అధికారంలోకి రావడానికి, బలమైన జాతీయ పార్టీగా అవతరించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆరెస్సెస్ నెట్ వర్క్ అందుకు ఉపయోగపడింది. ఆఖరికి వాజపేయ హయాంలో స్వంతంగా అధికారంలోకి రాగలిగింది.

చిత్రమేమిటంటే వాజపేయి టైమ్ లో కావచ్చు, మోడీ టైమ్ లో కావచ్చు, భారతీయ జనతా పార్టీ చరిష్మా కన్నా, ఆ ఇద్దరు నేతల చరిష్మానే బలమైనది. వాజపేయిని రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్ అని, ఫేస్ టు భాజపా అని ఇలా రకరకాలుగా అనేవారు. కానీ ఆ తరువాత మళ్లీ భాజపా ఒంటరిగా అధికారం సాధించడంలో వెనుకబడింది. 

వాజపేయి తరవాత మళ్లీ అలాంటి ఫేస్ మోడీ రూపంలో భాజపాకు దొరికింది. కానీ ఆయన వాజపేయి మాదిరిగా కాదు. రైట్ పర్సన్ ఇన్ రైట్ పార్టీనే. ఆరెస్సెస్, భాజపా సిద్దాంతాలను రంగరించి, వాటిని తనదైన స్టయిల్ లో అమలు చేసే నాయకుడు. దేశం మొత్తం మీద మరే పార్టీలోనూ మోడీకి ధీటైన నాయకుడు ఇప్పుడు లేడు. అది అంగీకరించాల్సిన నిజం. కానీ అదే మోడీ దేశంలో అందరికీ అంగీకారయోగ్యమైన నాయకుడు కాదు. అది కూడా నిజం.

దేశంలో ఏకైక నాయకుడుగా మారిన మోడీ ఏకాభిప్రాయంతో వచ్చే మద్దతును ఎందుకు సాధించలేకపోతున్నారు? మోడీ పాలన ఎందుకు జనరంజకం కావడం లేదు? అయిదేళ్లు దాటి రెండో పర్యాయం పాలన ప్రారంభం అయిన దగ్గర నుంచి మోడీ విధానాలు ఎందుకు నచ్చడం లేదు? అన్నింటికి మించి మాటలతో గారడీ చేసే మోడీ ముసుగు ఎందుకు తొలిగిపోతోంది.

మోడీ పాలన లేదా కాంగ్రెస్ పాలన లను బేరీజు వేస్తూ, మంచి చెడ్డలు ముచ్చటించుకోవాలి అంటే చాలా వుంది వ్యవహారం. అది ఒకటి రెండు పేజీలకు సరిపోయేది కాదు. కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో, వీలయినన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనే వుండేది కాబట్టి, ప్రధాని నియంతృత్వ పోకడలు అంతగా తొంగిచూసేవి కాదు. 

ఇందిర, రాజీవ్ హయాంలో ఈ నియంతృత్వ పోకడలు కూడా పార్టీలో  ఎక్కువగా వుండేవి తప్ప, ప్రజలపై ప్రభావం చూపింది తక్కువ. పైగా అప్పట్లో ఇంకా జనాల్లో జాతీయ భావనలు వుండేవి.  మాకేంటీ అనే భావన కేవలం తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాల్లో వుండేదని వినిపించేది తప్ప మిగిలిన చోట్ల తక్కువ. తమిళనాడులో కూడా తమకు ఎవరు మేలు చేస్తే వారికే సై అనే పద్దతి కొనసాగేది.

కానీ 80వ దశకం నుంచి దేశంలో రాజకీయాల తీరుమారిపోయింది. ప్రాంతీయ పార్టీలు పురుడుపోసుకోవడం ఎక్కువయింది. జోరందుకుంది. ఈ ప్రాంతీయ పార్టీల పుట్టుక కేవలం ప్రాంతీయతా పునాదుల మీదే అయితే వేరేగా వుండేది. కానీ ఆ పునాదుల్లో కులాలు కూడా వుండడం అన్నది కీలకంగా మారింది. ఇక్కడే జాతీయ పార్టీలకు దెబ్బపడడం అన్నది ప్రారంభమైంది. సిద్దాంతాల విధానాలు జాతీయ పార్టీలకు వుంటాయేమో కానీ కులాల వ్యవహారాలు కష్టం. ఒక రాష్ట్రం ఒక కులం అని కాదు కదా..దేశం అంటే. అందుకే కులాల పునాదులపై, ప్రాంతీయ భావజాలం ఆలంబనగా పుట్టిన పార్టీల ముందు నిలదొక్కుకోవడం అన్నది జాతీయ పార్టీలకు సవాలుగా మారింది.

అలాంటి టైమ్ లో పార్టీని బలోపేత చేసి, దేశ వ్యాప్తంగా బలమైన పార్టీగా నిర్మించే ఆలోచన చేయడానికి బదులు కాంగ్రెస్ పార్టీ సంకీర్థ రాజకీయాలకు తెరలేపింది. ఒకప్పుడు జరిగిన జనతా ప్రయోగానికి మరో వెర్షన్ ఇది. ఇక్కడ కాంగ్రెస్ పాలకపక్షంగా వుంటుంది. ప్రాంతీయ పార్టీలు సామంత రాజుల్లా వుంటాయి. మీ రాష్ట్రం మీరు చూసుకోండి . ఢిల్లీ గద్దె మాకు వదిలేయండి అనే రీతిలో కాంగ్రెస్ రాజకీయం సాగింది.

కానీ ఎప్పుడయితే ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరుగుతూ వస్తోందో, జాతీయ కూటమిల సంఖ్య కూడా పెరిగింది. కాంగ్రెస్ కూటమికి పోటీగా భారతీయ జనతా కూటమి కూడా వచ్చి చేరింది. ఇప్పుడు ముచ్చటగా మూడో కూటమి అవసరం కూడా కనిపిస్తోంది. ఆ దిశగా చిరకాలం విఫలయత్నాలు జరుగుతూనే వస్తున్నాయి. ఓ జాతీయ స్థాయి నాయకత్వం అన్నది లేకుండా కూటమి ఏర్పాటు కష్టం అనే పాఠం నేర్పుతూనే వస్తున్నాయి.

ఇలాంటి వ్యవహారాలు సాగుతుండగా ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు మరో ముచ్చట చెప్పకనే చెప్పాయి. ఇప్పుడు కాకున్నా రేపయినా సరే, మనం, ప్రాంతీయ పార్టీలే తప్ప, మనకు వేరే జాతీయ పార్టీలు అనవసరం అన్న రీతిలో ప్రజల ఆలోచనలు సాగుతున్నాయి. బెంగాల్ లో బలమైన మరో ప్రాంతీ పార్టీ లేదు కనుక అక్కడ భాజపా గట్టి యుద్దం చేయగలిగింది. కానీ అదే తమిళనాడులో కానీ మరోచోట కానీ అలా సాధ్యం కావడం లేదు. అక్కడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీని పట్టుకుని ఈదాల్సిందే తప్ప మరో గత్యంతరం లేకపోతోంది.

అయితే ఈ పార్టీ లేకుంటే ఆ పార్టీ  అనే ఆనవాయితీ ఒకప్పుడు తమిళనాట వుండేది. ఇప్పుడు అదే ఆనవాయితీ దాదాపు అన్ని రాష్ట్రాలకు సోకేలా వుంది. ఉత్తరాదిలో మాత్రం ఇంకా భాజపాకు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పాటు చోటు వుంది. కానీ దక్షిణాదిలో, దానికి కాస్త అటు ఇటుగా వున్న రాష్ట్రాల్లో ఈ అవకాశం రాను రాను సన్నగిల్లుతోంది.

ఫెడరల్ సిస్టమ్ కు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది అన్నది వాస్తవం. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం అనే పదం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే వరకు అంతగా వినిపించలేదు. కానీ ఇప్పుడు ఎవ్వరూ ఆ మాట అనకపోయినా జరుగుతున్నది అదే. జీఎస్టీని తీసుకువచ్చి రాష్ట్రాల ఆదాయాన్ని నేరుగా కేంద్రం ఖాతాకు మళ్లించింది. కేంద్రం ఆధ్వర్యంలో వుండే సంస్థలను మెలమెల్లగా కనుమరుగు చేస్తోంది. ప్రాంతీయంగా వుండే బ్యాంకులను లేకుండా చేసింది. కారణం అని భాజపా అభిమానులు అనొచ్చు. సాకు అని కిట్టని వారు అనొచ్చు. కానీ మొత్తం మీద జరుగుతున్నది అంతా కేంద్రం ఇష్టా రాజ్యపాలన తప్ప వేరు కాదు.

ఇలాంటి నేపథ్యంలో భాజపా కూడా కాంగ్రెస్ అవసాన కాలంలో వేసిన తప్పటడుగులు వేస్తోంది. అధికారం అందించుకోవడం కోసం వెర్రి మెర్రి ఆలోచనలు చేస్తోంది.  ప్రాంతీయంగా చోటు చేసుకున్న కులాల సమతూకంలో తలదూరుస్తోంది. ఆంధ్రలో రెండు అగ్రకులాలు అధికారం అందుకుంటూ వుంటే అధికారం అందని మూడో కులాన్ని భాజపా దగ్గరకు తీయాలని చూస్తోంది. తమిళ నాట అన్నాడిఎమెకే రాజకీయాల్లో వేళ్లు పెట్టి, పరోక్షంగా అధికారం సాధించాలనుకుంది కానీ జనం ఆ విషయాన్ని పసిగట్టే డి ఎమ్ కె కు అధికారం అందించారు. 

ఆంధ్ర ఉపఎన్నికలో భాజపాను తలదించుకునేలా చేసారు. కర్ణాటక స్థానిక ఎన్నికల్లో, ఆఖరికి ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో భాజపాను పక్కన పెట్టి మళ్లీ ప్రాంతీయ పార్టీలను ముందుకు తెచ్చారు. ఈ ప్రాంతీయ పార్టీలు కొత్తవి కాదు. ఒకప్పుడు జనం పక్కన పెట్టినవే. కానీ ఇప్పుడు వాటిని అన్నా మళ్లీ ముందుకు తెస్తాం కానీ భాజపా వద్దు అన్నట్లు వ్యవహరించారు ఓటర్లు

అంటే కాంగ్రెస్ బదులు భాజపాను గౌరవించిన ఓటర్లు దాని మోనోపలీ వ్యవహారాలను భరించలకపోయారు. కేంద్రం అంటే అదో రాజరిక విధానం, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాలు భరించాల్సిందే అన్న పద్దతిని ఓటర్లు పసిగట్టడమే కాదు జీర్ణించుకోలేకపోతున్నారు. మోడీకి భాజపాకు వ్యతిరేకంగా పోరాడలేని పార్టీలను ప్రజలు పట్టించుకోవడం లేదు. అలా పోరాడగలిగే పార్టీలు వుంటే మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే.

అయితే ఇక్కడ మళ్లీ తృతీయ కూటమి, జాతీయ నాయకత్వం వంటి ప్రయోగాలను యాంటీ మోడీ పక్షాలు చేస్తే జనం ఎలా స్పందిస్తారో అన్నది క్లారిటీ లేదు. కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయంగా అధికారంలోకి వచ్చేది మాత్రం యాంటీ మోడీ వర్గాలే అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇది గ్రహించక ఆంధ్ర లాంటి చోట్ల అటు జగన్ ఇటు చంద్రబాబు ఇంకా మోడీ పార్టీ ప్రాపకం కోసం చూస్తున్నారు. 

కేసిఆర్ లాంటి వాళ్లు మాత్రం ధైర్యం చేసి ఢీకొంటున్నారు. అలా ఢీకొనే మమత, స్టాలిన్ విజయం సాధించారు. ఈడీ, ఐటి, సిబిఐ ల ద్వారా ఈ ఇద్దరు నాయకులను ఎంతగా కార్నర్ చేసినా భరించారు. సహించారు. పోరాడారు. గెలిచారు. వీటికి భయపడి భాజపా చేతిలో పార్టీగా మారిన అన్నాడిఎమ్ కె ను జనం పక్కన పెట్టారు.

ప్రస్తుతం మహరాష్ట్రలో లోకల్ వెర్సస్ జాతీయం అన్న పోరు సాగుతోంది. త్వరలో యుపి, కర్ణాటక, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా పోరు సాగుతుంది. అక్కడ కనుక మళ్లీ ఇటీవల వచ్చిన ఫలితాలే రిపీట్ అయితే ఇక జాతీయ పార్టీగా కాంగ్రెస్ బాటనే భాజపా కూడా పట్టాల్సి వస్తుంది. 

ఎందుకంటే ఈ రెండు పార్టీలకు ఓ సారూప్యం వుంది. కాంగ్రెస్ కు వృద్ద నాయకత్వం తప్ప యువ నాయకత్వం అన్నది, సెకెండ్ లేదా ధర్డ్ జనరేషన్ అన్నది లేదు. భాజపాకు అసలు లిమిటెడ్ నాయకత్వం తప్ప కేడర్ అన్నది లేదు. ఆరెస్సె స్ తదితర హిందూ సంఘాల కార్య కర్తలు తప్ప స్థానిక కేడర్ శూన్యం. అందువల్ల మోడీ నన్నా మారాలి. లేదా ఆయన తీరు అన్నా మారాలి. లేదూ అంటే కేంద్రంలో కొత్త కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు పురుడుపోసుకుంటాయి.

చాణక్య