చాలా ఆచి తూచి వ్యవహరిస్తారు రాజకీయ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల్లో విజేతలను అభినందించే విషయంలో కూడా చాలా పద్దతిగా డ్రాఫ్ట్ చేసి ట్వీట్ చేసారు. అంత జాగ్రత్తగా వుండే జగన్ ఈ రోజు మరి తొందర పడ్డారో లేదా దాని వెనుక ఏమైనా వత్తిడులు వున్నాయో? లేక రాజకీయ స్ట్రాటజీ నో మొత్తానికి ఓ ట్వీటు వేసారు.
ప్రధాని మోడీ ప్రభ మసకబారుతున్నవేళ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోడీ ప్రతిష్టకు గట్టి డ్యామేజ్ జరిగిన నేపథ్యంలో, ఇంకా మరింతగా ఆయనపై దాడి జరగకుండా ప్రతిపక్షాలను నివారించేందుకు వీలుగా జగన్ ఓ ట్వీటు వేసి, అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
ఫెడరల్ సూత్రాలకు ఏనాడో తిలోదకాలు ఇచ్చేసి, ప్రధాని మోడీ అంతా నా ఇష్టం అన్నట్లు ముందుకు సాగుతున్నారు. ఈ రోజు మన్ కీ బాత్ అన్నట్లుగా సిఎమ్ ల మీటింగ్ లో కూడా తాను చెప్పాల్సింది చెప్పుకుంటూ పోయారు.
దీంతో జార్ఖండ్ సిఎమ్ హేమంత్ సోరెన్ కు చిర్రెత్తుకు వచ్చింది. ఆ సమావేశంలో తనను మాట్లాడనివ్వలేదు. తాము చెప్పేది మోడీ వినడం లేదని, ఆయన చెప్పింది వినడమే తమ కర్తవ్యంగా మారిందనే భావన కలిగింది ఆయనకు. అందుకే తాను చెప్పాల్సింది ట్విట్టర్ సాక్షిగా వెళ్ల గక్కేసారు.
అయితే దీనికి ప్రతిగా భాజపా నుంచో, మోడీ వైపు నుంచో లేదా ఇతర భాజపా నాయకుల నుంచో సమాధానం రావాల్సి వుంది. కానీ చిత్రంగా అస్సలు ఆలస్యం చేయకుండా ఆంధ్ర సిఎమ్ జగన్ స్పందించారు. నిజానికి ఆయనకు అస్సలు సంబంధం లేని విషయం ఇది. అయినా ఆయన స్పందించి, మోడీని వెనకేసుకువచ్చారు.
కరోనా కల్లోలం నేపథ్యంలో ఒకరిని ఒకరు తప్పు పట్టే బదులు, కలిసి మెలిసి సమస్యను ఎదుర్కోవాలనే విధంగా ట్వీట్ వేసి, హేమంత్ సొరెన్ కు హిత బోధ చేసారు. ఇలా చేయడంలో జగన్ తొందరపడ్డారు అని అనుకోవడానికి లేదు.
అంతకన్నా, జగన్ ను తొందరపెట్టి వుంటారు అని అనుకోవచ్చు. ప్రతిపక్షాలను రెండుగా విడదీసి, తన జోలికి రాకుండా చేసుకోవచ్చు అని దిశగా మోడీ డైరక్షన్ లో జగన్ యాక్షన్ చేసి వుండొచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.