టాలీవుడ్ ధీమాయే వేరు

కరోనా తొలి దశ టైమ్ లో టాలీవుడ్ పూర్తిగా డీలా పడింది. మళ్లీ సినిమాల విడుదల ఎప్పుడు వుంటుందా? థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా? జనాలు థియేటర్లకు ధైర్యంగా వస్తారా? రారా? ఇలా అనేక రకాల…

కరోనా తొలి దశ టైమ్ లో టాలీవుడ్ పూర్తిగా డీలా పడింది. మళ్లీ సినిమాల విడుదల ఎప్పుడు వుంటుందా? థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా? జనాలు థియేటర్లకు ధైర్యంగా వస్తారా? రారా? ఇలా అనేక రకాల సందేహాలు. కానీ అవన్నీ పటాపంచ లయిపోయాయి ఆ తరువాత. 

థియేటర్ల గేట్లు తెరవడం భయం, జనాలు వేలాదిగా పరుగెత్తుకువచ్చారు. ఇండస్ట్రీకి వరుసగా నెలకో బ్లాక్ బస్టర్ ను అందించారు. కట్ చేస్తే..ఇప్పుడు సెకెండ్ వేవ్ స్టార్ట్ అయింది. 

మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్ లు ఆగిపోయాయి. అయినా టాలీవుడ్ ఏ మాత్రం టెన్షన్ పడడం లేదు. ప్లానింగ్ లు, డిస్కషన్లు యధావిధిగా సాగుతున్నాయి. ఎక్కడ వీలయితే అక్కడ వర్క్ లు చేసుకుంటున్నారు. అంతకు మించి జూన్ లో విడుదల చేద్దాం అని అనుకుంటున్నవారు ప్రమోషన్లు కూడా చేస్తున్నారు.

కరోనా మలి దశ మహా అయితే మే నెలాఖరు వరకు వుంటుంది. ఆ తరువాత మళ్లీ అంతా మామూలు అవుతుంది అని టాలీవుడ్ జనాలు బలంగా విశ్వసిస్తున్నారు. పైగా యూనిట్లు అన్నీ ప్రభుత్వం ప్లానింగ్ కోసం చూడకుండా ఎవరికి వారు వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు. స్టాఫ్ ఒక్కొక్కరికి 1500 ఖర్చు చేసి మరీ వ్యాక్సినేషన్ చేయిస్తున్నారు.

ఈసారి థియేటర్ల మీద, షూటింగ్ ల మీద ఆంక్షలు ఏమీ లేవు. కరోనా తగ్గుముఖం పట్టగానే ఎవరికి వారు స్టార్ట్ చేసుకోవడమే. అందుకే ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుని రెడీగా వుండేలా చూసుకుంటున్నారు. 

కరోనా సెకెండ్ వేవ్ గురించి అస్సలు టెన్షన్ పడడం లేదు టాలీవుడ్ అనే చెప్పాలి. జనాలు అంతా కరోనా వార్తల మీదా కరోనా వ్యవహారాల మీద దృష్టి పెట్టి వుంటే టాలీవుడ్ లో మాత్రం పాటల విడుదలలు, ఫస్ట్ లుక్ లు సాగుతున్నాయి.