జోరు తగ్గిన షర్మిల

తెలంగాణలో వైఎస్ షర్మిల జోరు తగ్గింది. గతంలో ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు. ఆమెలో ఉత్సాహం తగ్గిందని, జోష్ మాయమైందని కాదు. పరిస్థితులు అలా వచ్చాయి. ఆమె తెలంగాణలో అడుగుపెట్టినప్పుడే కరోనా సెకండ్ వేవ్…

తెలంగాణలో వైఎస్ షర్మిల జోరు తగ్గింది. గతంలో ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు. ఆమెలో ఉత్సాహం తగ్గిందని, జోష్ మాయమైందని కాదు. పరిస్థితులు అలా వచ్చాయి. ఆమె తెలంగాణలో అడుగుపెట్టినప్పుడే కరోనా సెకండ్ వేవ్ అప్పుడే నెమ్మదిగా మొదలవుతోంది. 

వివిధ జిల్లాల్లోని వైఎస్ అభిమానులతో ఆమె ఆత్మీయ సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా కరోనా జోరు పెరగలేదు. కాని షర్మిల ఖమ్మం సభ నిర్వహించే సమయానికి కరోనా పెరిగింది. తన రాజకీయ అరంగేట్రం సభను చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ఆమె ప్లాన్ చేసింది.

లక్ష మందితో సభ నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ కరోనా పెరగడంతో ప్రభుత్వం ఆమె సభ నిర్వహణపై ఆంక్షలు విధించింది. ఆరువేల మందికి మించి జనం రాకూడదని పోలీసులు కట్టడి చేశారు. 

సరే … ఆరువేలమంది మాత్రమే రావాలని చెప్పినంత మాత్రాన అంతమందే రారు కదా. కాస్త ఎక్కువమందే వచ్చారు. కాని షర్మిలకు, ఆమె అనుచరులకు నిరాశ ఎదురైంది. నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అందుకోసం తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించింది.

చెప్పిన ప్రకారమే ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష మొదలుపెట్టింది. ఆమెకు అది కూడా నెరవేరలేదు. ఒక్కరోజు నిరాహార దీక్ష చేయగానే పోలీసులు ఆమెను ఇంటికి పంపారు. మొత్తం మీద ఇంట్లో నిరాహార దీక్ష చేసి మమ అనిపించింది. 

తన అభిమానులు, అనుచరులు జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తారని ప్రకటించింది. కాని కరోనా వ్యాప్తి కారణంగా అదీ కాలేదు. తెలంగాణాను  కరోనా చుట్టుముట్టి కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో షర్మిల కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమైపోయింది.

మధ్య మధ్య కేసీఆర్ మీద వ్యంగ్య బాణాలు వేస్తూ కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని కోరుతోంది. ఈలోగా ఈటల రాజేందర్ ఎపిసోడ్ మొదలైంది. ఆయన మీద భూకబ్జా ఆరోపణలు రావడం, కేసీఆర్ వెంటనే విచారణ జరిపించడం. రిపోర్ట్ తెప్పించుకోవడం. 

ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి అటు మళ్లింది. మీడియా కూడా ఈటల ఎపిసోడ్ నే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. జనం కూడా కరోనాతో బాధలు పడుతూనే ఈటల విషయమై చర్చించుకుంటున్నారు. ఈ గందరగోళంలో, హడావిడిలో షర్మిల గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు.

షర్మిల వచ్చిన కొత్తల్లో ఆమె గురించి మీడియా హైలైట్ చేసింది. ఆమె ఉపన్యాసాలకు, కామెంట్లకు అంతో ఇంతో ప్రాధాన్యం దక్కింది. కాని ఇప్పుడు కరోనా, ఈటల రాజేందర్ తప్ప మీడియాకు మరో సబ్జెక్ట్ కనబడటం లేదు. అందులోనూ ఈ మధ్యకాలంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు, నాగార్జున సాగర్, తిరుపతి ఉప ఎన్నికలు వచ్చాయి. 

మీడియా మొత్తం ఈ ఎన్నికలపైనే దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల తరువాతనే ఈటల ఎపిసోడ్ మొదలైంది. అందుకే షర్మిల గురించి మీడియా పట్టించుకోలేదు. అందులోనూ ఆమె కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. ఆమె పార్టీ పేరు ప్రకటించడానికి, విధానాలు తెలియచేయడానికి ఇంకా సమయం ఉంది.

ఇందుకోసం ఆమె మరో సభ ప్లాన్ చేస్తుందేమో తెలియదు. కేసీఆర్ కు కొద్దిలో కొద్దిగానైనా పోటీ ఇవ్వడానికి షర్మిల వచ్చిందని కొందరు అనుకున్నారు. కాని ఇప్పుడు ఈటల రాజేందర్ తయారయ్యాడు. ఆయన పక్కా లోకల్ కాబట్టి, ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి, ఆయనకు రాజకీయ నేపథ్యం, చరిత్ర ఉన్నాయి కాబట్టి మీడియా, రాజకీయపార్టీల దృష్టి ఆయన మీదనే ఉంటుంది. 

ఈటల సొంతంగా పార్టీ పెడితే కేసీఆర్ వ్యతిరేకులు ఆయన పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతారు. తెలంగాణలో అధికారం సాధించాలనే షర్మిల ఆశలు ఏ విధంగా నెరవేరుతాయో.