హైదరాబాద్ ను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే ఓ పాజిటివ్ కేసు నమోదుకాగా.. ఇప్పుడీ కరోనా ఎఫెక్ట్ సాఫ్ట్ వేర్ బెల్ట్ ను తాకింది. హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ లో కరోనా కేసు బయటపడింది. దీంతో మైండ్ స్పేస్ బిల్డింగ్ లోని నంబర్ 20లో ఉన్న కంపెనీలన్నింటినీ హుటాహుటిన ఖాళీ చేయించారు. ఉద్యోగులందర్నీ ఇంటికి పంపించి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చారు.
మైండ్ స్పేస్ 9వ అంతస్తులో నంబర్ 20లో ఉన్న డీఎస్ఎం ఆఫీస్ లో కరోనా కేసు బయటపడింది. ఈ కంపెనీకి చెందిన ఓ మహిళా ఉద్యోగి, 2 వారాల కిందట ఇటలీ నుంచి వచ్చింది. ఆమెకు కరోనా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. దీంతో డీఎస్ఎం ఆఫీస్ తో పాటు నంబర్-20 బ్లాక్ మొత్తాన్ని ఖాళీ చేయించారు.
తమ లొకేషన్ తో కరోనా బయటపడ్డంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు. మైండ్ స్పేస్ కు ఎదురుగా ఉన్న కాగ్నిజెంట్ లో కూడా సగానికి పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశారు. ఈ ప్రాంతంలో ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతా ఎక్కువగా మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీంతో ఇప్పుడు కరోనా ప్రభావం మెట్రోపై కూడా పడింది. ఈ కేసుతో కలుపుకొని హైదరాబాద్ లో కరోనా బాధితుల సంఖ్య 2కు చేరింది.
అటు భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు ఒకేసారి 28కి చేరినట్టు కేంద్రం ప్రకటించింది. 16 మంది ఇటాలియన్ టూరిస్టులతో పాటు ఓ భారతీయ డ్రైవర్ కు కరోనా సోకినట్టు కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో ఓ వ్యక్తికి కరోనా సోకగా, అతడి వల్ల ఆగ్రాలో ఉన్న ఆరుగురికి కరోనా వ్యాప్తిచెందినట్టు ప్రకటించారు. ఇలా కేసులు ఒకేసారి పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. ఏ దేశం నుంచి వచ్చినా స్క్రీనింగ్ టెస్ట్ ను తప్పనిసరి చేశారు.