తన విభిన్న నటనతో తక్కువ కాలంలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్బుక్లో నకిలీ పేజీని సృష్టించి యువతులకు వల పన్నాడో దుష్టుడు. తన పేరుతో ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేయడంతో పాటు యువతులే టార్గెట్ చేసుకుని చాటింగ్ చేస్తున్న విషయం విజయ్ దృష్టికి వెళ్లింది. దీంతో విజయ్ దేవరకొండ తన సహాయకుడినే యువతిగా రంగంలోకి దింపి చాటింగ్ చేయించి…ఆ మోసగాడి భరతం పట్టాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ పాపులారిటీని అతను సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఆ హీరో పేరుతో ఫేస్బుక్ నకిలీ పేజీ సృష్టించి అమ్మాయిలకు వల వేయాలనుకున్నాడు. విజయ్ పేరుకున్న ఆకర్షణతో…ఆ పేజీకి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లలో అమ్మాయిలవి మాత్రమే అతను యాక్సప్ట్ చేయసాగాడు. ఆ తర్వాత మెసేంజర్ ద్వారా యువతులతో చాటింగ్ స్టార్ట్ చేశాడు. ప్రేమ, పెళ్లి, సహజీవనం అంటూ చాటింగ్ చేయసాగాడు.
ఆ నోట ఈ నోట విజయ్ స్నేహితుల చెవుల్లో పడింది. ఈ వ్యవహారాన్ని ఇటీవల కొందరు సన్నిహితులు విజయ్ దేవరకొండ దృష్టికి తీసుకెళ్లారు. ఆ మోసగాడికి చెందిన వాట్సాప్ నంబర్ సైతం అందించారు. దీంతో అసలు నిజం తెలుసుకోవాలని భావించిన విజయ్ తన సహాయకుడిగా పని చేసే గోవింద్‌ను యువతి మాదిరిగా ఆ నంబర్‌తో చాటింగ్ చేయమని సూచించాడు.
తన పేరు హేమ అంటూ పరిచయం చేసుకున్న గోవింద్ ఆ మోసగాడితో చాటింగ్ చేయగా… తాను విజయ్ దేవరకొండ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను ప్రేమ, పెళ్లి , సహజీవనం రొటీన్ డైలాగ్స్, చాటింగ్స్ మొదలెట్టాడు. దీంతో పాటు ఆ మోసగాడు దాదాపు పది మంది యువతులను ఇలానే మోసం చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మంగళవారం గోవింద్‌తో పాటు విజయ్ దేవరకొండ మేనేజర్ సైతం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
అంతకు ముందు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు హీరో విజయ్ తన మేనేజర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టాడు. ఈ కేసులో నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మోసగాడి భరతం పడతామని పోలీసులు చెప్పారు.