పటౌడీ వంశం.. ఉత్తర భారతంలో సంస్థానాలను ఏలిన ముస్లిం కుటుంబాల్లో ఒకటి. అయితే హిందువులను పెళ్లి చేసుకున్నారు ఈ పటౌడీ వంశంలోని రాజులు! వారిలో టైగర్ పటౌడీ ఒకరు. షర్మిలా ఠాగోర్ ను పెళ్లి చేసుకున్నారాయన. ఆ తర్వాత వారి తనయుడు సైఫ్ అలీ ఖాన్ తన కన్నా వయసులో పెద్దదైన అమృతా సింగ్ ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరి పిల్లలు. వారిలో ఒకరే బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్.
తల్లిదండ్రులు విడిపోయినా.. వారిద్దరితోనూ టచ్లో ఉంటుంది సారా. ఆ మధ్య తండ్రి రెండో పెళ్లి లో అంతా తనే దగ్గరుండి చూసుకుంది. తన పిన్ని కరీనాతో కూడా సన్నిహితంగా మెలుగుతూ ఉంటుంది. ఒకవైపు హీరోయిన్ గా బిజీగా ఉండే సారా.. తీరిక సమయాల్లో గుళ్లుగోపురాలు బాగా తిరుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించి మీడియా కొన్ని వార్తలను ఇస్తూ ఉంటుంది.
ఆ సంగతలా ఉంటే.. తాజాగా తన కాశీయాత్ర ఫొటోలను ఇన్ స్టాగ్రమ్ లో పోస్టు చేసింది సారా. తన తాజా సినిమా కూలీ నంబర్ వన్ షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో గ్యాప్ లో సారా సోలోగా కాశీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ గంగా హారతిని వీక్షించడంతో పాటు.. గంగా ఒడ్డున ప్రశాంతంగా గడిపినట్టుగా సారా ఫొటోలు పోస్టు చేసింది. ఇది వరకూ ముంబైలోని పలు ఆలయాల వద్ద సారా కనిపించింది. అప్పుడు మీడియా ప్రతినిధులు ఫొటోలు క్లిక్ మనిస్తుండగా.. 'భయ్యా.. మందిర్..' అంటూ వారిని వారించింది సారా. ఇప్పుడు కాశీ యాత్రనే చేసింది.