ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వాధినేతల ఆసక్తికి అనుకూలంగా సంక్షేమ పథకాలు ఉండటం మామూలే. తమ తమ పేర్లు చిరకాలం గుర్తుండేలా, తమ వల్ల ప్రయోజనాలు పొందిన వారికి అది పూర్తిగా గుర్తుండిపోయేలా వారు సంక్షేమ పథకాలకు పేర్లు పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఉగాది రోజున ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టనున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం విషయంలో ఒక ఆసక్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు.
ఈ కార్యక్రమం కింద ఇచ్చే ఇళ్ల స్థలాల ప్రాంతాలకు కాలనీలుగా ఒకే పేరును ఖరారు చేశారట. ప్రతి ఊర్లోనూ ఇలాంటి ఇళ్ల పట్టాల పంపకం జరగనుంది. అలా పంచే ఇళ్ల స్థలాలు దాదాపుగా ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఇలాంటి క్రమంలో వాటికి వైఎస్ఆర్-జనగన్న కాలనీలు అని పేరు పెట్టనున్నారట.
ఇది వరకూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదలకు భారీగా ఇళ్లపట్టాలను ఇచ్చారు. వాటికి ఇందిరమ్మ కాలనీలు అని పేర్లు పెట్టారు. ఉమ్మడి ఏపీలో చాలా ఊర్లలో ఇందిరమ్మ కాలనీలు ఉంటాయి. అవన్నీ కూడా వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ పథకం కింద జారీ అయిన ఇళ్లు- స్థలాలు. వాటికి ఇందిరమ్మ కాలనీలు అని పేర్లు పెట్టి పట్టాలిచ్చారు. ఇందిరగాంధీపై వైఎస్ఆర్ కు ఉన్న అభిమానం, కాంగ్రెస్ పేరు మార్మోగేలా ఆయన హయాంలో ఆ పేరును పెట్టారు.
ఇక జగన్ హయాంలో.. చాలా వరకూ తన తండ్రి పేరుతోనే పథకాల అమలు ఉంది. ఇదే సమయంలో అటు జగన్ పేరు కూడా కలిసి వచ్చేలా కొత్త కాలనీలకు పేరును ఖరారు చేసినట్టుగా ఉన్నారు. వైఎస్ఆర్-జగనన్న కాలనీలు అని పేరు పెట్టడం ద్వారా అటు వైఎస్ఆర్ పేరు, ఇటు జగన్ పేరు ఈ పథకం లబ్ధిదారుల్లోకి వెళ్లడానికి డిసైడ్ చేసినట్టుగా ఉన్నారు. వైఎస్ఆర్- జగనన్న కాలనీ అనే పేరు లెంగ్తీ అవుతుంది. జనాలు కాలనీల పేర్లను షార్ట్ గా పిలుస్తుంటారు. అలా అయినా వైఎస్ఆర్ కాలనీలుగా ఈ ప్రాంతాలు నిలిచిపోయే అవకాశాలున్నాయి!