హాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాలని సమ్మర్లో విడుదల చేయాలని ముందే ప్లాన్ చేసుకుంటారు. సమ్మర్ బ్లాక్‌బస్టర్స్ అని వాటికి ప్రత్యేకమైన పేరు. ఇండియాలో కూడా భారీ బడ్జెట్ చిత్రాలని వేసవిలో విడుదల చేస్తే ఎక్కువ అడ్వాంటేజ్ వుంటుందనేది ప్రూవ్డ్ ఫ్యాక్టు. బాహుబలి మొదటి భాగాన్ని వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేసి జులైలో విడుదల చేసారు. రెండవ భాగం విషయంలో ఆ తప్పు జరగరాదని, ముందే డేట్ ఫిక్స్ చేసుకుని అనుకున్న తేదీకే వచ్చేసారు.
బాహుబలి 2 ఏ రేంజ్‌కి వెళ్లిందో తెలిసిందే. అవధులకి మించి ఖర్చు పెట్టినపుడు ఆ చిత్రం మాగ్జిమమ్ రీచ్ అయ్యే టైమ్ కూడా సెలక్ట్ చేసుకోవాలి. 2.0 చిత్రానికి ఎప్పుడూ రైట్ టైమ్ ఫిక్స్ చేసుకోలేదు. ముందుగా జనవరి 25న విడుదల చేద్దామని చూసారు. అప్పటికి సినిమా రెడీ కాకపోతే వేసవిలో వస్తుందన్నారు. గ్రాఫిక్స్ డిలే కావడంతో చివరకు నవంబర్ 29 డేట్ అనౌన్స్ చేసారు. ఇంత పెద్ద సినిమాకి అదేమి డేట్ అని చాలా మంది అభిప్రాయపడ్డారు.
2.0 ప్రధానంగా పిల్లలని, ఫ్యామిలీస్‌ని టార్గెట్ చేసిన చిత్రం. కనీసం ఒక్క హాలిడే కూడా లేని టైమ్‌లో, కనీసం యుఎస్‌లో అయినా అనుకూలమైన వాతావరణం లేని సమయంలో విడుదల చేయడం ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందని ట్రేడ్ పండితులు చెబుతూ వచ్చారు. 2.0 తొలి రోజు మంచి వసూళ్లే రాబట్టినప్పటికీ థియేటర్లలో పిల్లల జాడ లేదు. వీకెండ్స్‌లో తప్ప పిల్లలు, ఫ్యామిలీస్ వచ్చే అవకాశం లేదు. చూస్తూ, చూస్తూ ఇంత భారీ చిత్రాన్ని రాంగ్ టైమ్‌లో విడుదల చేయడం ఫైనల్ రిజల్ట్‌ని ప్రభావితం చేస్తుందా?