కొత్త నీరు వస్తున్నపుడు పాత నీరు దారివ్వాల్సిందే. తెలుగునాట సీనియర్లు ఆచితూచి సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది. కొత్తతరం నటులకు వస్తున్న క్రేజ్, ఓపెనింగ్స్ సీనియర్లకు వుండడంలేదు. సీనియర్ల ఫ్యాన్స్ ఫిక్స్ డ్ గా వుంటారు. కొత్త ఆడియన్స్ తోడవుతున్నా, వాళ్లు యంగస్టర్ ఫ్యాన్స్ గా వుంటారు తప్ప, సీనియర్ల ఫ్యాన్స్ గా వుండరు.
మరోపక్క సీనియర్ల ఫ్యాన్స్ లో సీనియారిటీ పెరిగిన కొద్దీ సినిమాలకు దూరం అవుతుంటారు. వెరసి, సీనియర్ల సినిమాలకు ఓపెనింగ్స్ కుమ్మేయడం కుదరదు. ఇది అనివార్యమైన సమస్య. సౌత్ ఇండియా సూపర్ స్టార్ అనుకున్న రజనీకాంత్ కూ ఇదే సమస్య తప్పలేదు.
చిరకాలంగా ఆయన ఫ్యాన్స్ సంఖ్య పెరగడంలేదు. పైగా వాళ్లలో సినిమా చూసేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఈ జనరేషన్ యంగ్ ఆడియన్స్ కు రజనీ అంటే క్రేజ్ ఎందుకు వుంటుంది? మన దగ్గర యంగ్ టాప్ హీరోలు అందరికీ వుంటుంది. తమిళనాట విజయ్ లాంటి వాళ్లకు వుంటుంది.
భారీ సినిమాలు తీసేటపుడు ఇది దృష్టిలో పెట్టుకోవడం అనివార్యం. మార్కెట్ లో కొత్త మోడళ్లకు క్రేజ్ వున్నట్లే, సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలకే క్రేజ్ వుంటుంది. ఇప్పటికే రజనీ సినిమాలు ఎలాతీసినా, జనాల ఆదరణకు దూరంగా వుంటున్నాయి.
కానీ రోబో 2.0 పరిస్థితి వేరు. అక్కడ శంకర్ వున్నారు. యూత్ లో కూడా డైరక్టర్ శంకర్ అంటే ఆదరణ వుంది. రోబో 2.0కు తెలుగునాట 13కోట్ల వరకు షేర్ తొలిరోజు వచ్చింది అంటే అది శంకర్ తోడు కాబట్టే.
త్రీడీ ప్రచారం
నిజానికి రోబో విషయంలో ఓ తప్పు జరిగింది. దాన్ని త్రీడీ సినిమాగా ప్రచారం చేసారు. దర్శకుడు శంకర్ కూడా త్రీడీలోనే చూడమని చెప్పారు. అందుకే ఇప్పుడు త్రీడీ థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. 2 డి థియేటర్లు ఫుల్ కావడంలేదు. మరీ దిగువ సెంటర్లలో 2డి థియటర్లే తప్ప, త్రీడీ థియేటర్లు లేవు. ఇది కూడా కలెక్షన్ల మీద అఫెక్ట్ చూపిస్తోంది.
నవంబర్ విడుదల
అసలు నవంబర్ రిలీజ్ అన్నది చాలా బ్యాడ్ డెసిషన్. ఇలాంటి సినిమాలు, ముఖ్యంగా పిల్లలు చూస్తారనే సినిమాలకు సమ్మర్ నే సరైన సీజన్. మహా అయితే సంక్రాంతి. ఆ రెండు సీజన్లు వదిలేసి, నవంబర్ లో వేయడం పెద్ద తప్పు.
ఇదే సిన్మా సమ్మర్ కు వచ్చి వుంటే టోటల్ రన్ కలెక్షన్లలో తెలుగులో కనీసం 10కోట్లు తేడా వస్తుంది. కనీసం డిసెంబర్ ఆఖరి వారం వేసుకున్నా క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయర్ వంటివి కలిసి వచ్చేవి. మరి తమిళ నిర్మాతలు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారోవారికే తెలియాలి.
మరోపక్క ఇంత భారీ సినిమాను తెలుగులోకి తెచ్చే ముందు ఓ భారీ ఫంక్షన్ చేసి వుండాల్సింది. దానివల్ల ఓపెనింగ్స్ మరింత బెటర్ గా వుండి వుండేవి. కేవలం జస్ట్ విడుదలకు రెండురోజుల ముందు ఓ ప్రెస్ మీట్ మాత్రం చేయగలిగారు.
తెలుగు బయ్యర్లు సేఫ్ నే
నిజానికి తెలుగు బయ్యర్లకు పెద్దగా ప్రమాదంలేదు. ఎందుకంటే 72 కోట్లకు దీన్నికొన్నారు. అందులో 15కోట్లు రికవరబుల్ అడ్వాన్స్. అంటే 60కోట్లు చేస్తే సరిపోతుంది. సినిమా విడుదల చేసిన ఎన్వీప్రసాద్, యువి, దిల్ రాజు ముగ్గురికీ థియేటర్ల నెట్ వర్క్ వుంది.
అందువల్ల పైసా పోకుండా షేర్ లెక్కలు వుంటాయి. ఫస్ట్ వీకెండ్ ముఫైకోట్ల వరకు వుండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా కడుతున్నాయి. ఇప్పటికే త్రీడీ థియేటర్లు అన్నీ ఫస్ట్ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. కాబట్టి, ఈ ఫిగర్ కు కాస్త అటు ఇటుగా వసూళ్లు వుండే అవకాశం వుంది.