ఆదేశాలు స‌రే… ఆచ‌ర‌ణేది జ‌గ‌న్‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాలు చూస్తే… అబ్బా ఎంత బాగా చేస్తున్నారో అనే భావ‌న క‌లుగుతుంది. కానీ ఆయ‌న ఆదేశాలు క్షేత్ర‌స్థాయిలో ఏ మాత్రం ఆచ‌ర‌ణ‌కు నోచుకోవ‌డం లేదు.  Advertisement ఆరోగ్య‌శ్రీ కింద ఉచిత…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాలు చూస్తే… అబ్బా ఎంత బాగా చేస్తున్నారో అనే భావ‌న క‌లుగుతుంది. కానీ ఆయ‌న ఆదేశాలు క్షేత్ర‌స్థాయిలో ఏ మాత్రం ఆచ‌ర‌ణ‌కు నోచుకోవ‌డం లేదు. 

ఆరోగ్య‌శ్రీ కింద ఉచిత వైద్యం, ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మంచి వైద్యం అందించాల‌నే ఆదేశాలు ఇప్ప‌టికే చాలా సార్లు ఆయ‌న చేశారు. మున్ముందు కూడా ముఖ్య‌మంత్రిగా త‌న వంతు బాధ్యత‌గా చేస్తూనే ఉంటారు. కానీ బాధితుల‌కు న్యాయం జ‌రిగేదెన్న‌డు? అనేదే ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

కోవిడ్‌ నియంత్రణ, నివారణ, చికిత్స, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఉండాలని స్పష్టం చేశారు. 

ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో విధిగా కోవిడ్‌ పేషెంట్లకు 50 శాతం బెడ్లు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. అంతకంటే ఎక్కువగా రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవడంతో పాటు బెడ్లు కేటాయించాలని సీఎం స్ప‌ష్టం చేశారు. కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆయ‌న ఆదేశించారు. ఇందులో ఎక్కడా తేడా రాకూడదన్నారు.

ఒక వైపు ముఖ్య‌మంత్రి ఆదేశాలు ఇలా ఉంటే, ప్రైవేట్ ఆస్ప‌త్రులు తాము అనుకున్న‌ట్టుగా దోచుకుంటున్నాయి. ఆరోగ్య‌శ్రీ కింద అడ్మిష‌న్ అంటే.. బెడ్స్ లేవ‌ని తెగేసి చెబుతున్నాయి. 

అస‌లు ఆస్ప‌త్రుల్లో అడుగే పెట్ట‌నివ్వ‌కుంటే, ఇక ఉచిత వైద్య‌మ‌నే ప్ర‌శ్నే త‌లెత్త‌దు క‌దా? ఇవేవీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలియ‌వ‌ని అనుకోవాలా? లేక జ‌నాలు పిచ్చోళ్ల‌ని ప్ర‌భుత్వం భావిస్తోందా? ఎందుకీ నాట‌కాలు?

ప‌దేప‌దే ఆరోగ్య‌శ్రీ కింద 50 శాతం బెడ్లు ఇవ్వాల‌ని, ఉచిత వైద్యం అందించాల‌ని చెబుతున్న ప్ర‌భుత్వ పెద్ద‌లు ….ఏఏ ఆస్ప‌త్రుల్లో ఎంతెంత మందికి ఉచిత వైద్యం అందుతున్న‌దో లెక్క తేల్చే స‌త్తా లేదా? లేక చిత్త‌శుద్ధి కొర‌వ‌డిందా? తాము ఆదేశాలు ఇచ్చిన ట్టుండాలి…ప్రైవేట్ ఆస్ప‌త్రులు మాత్రం పాటించ‌కుండా ప‌ని జ‌రిగిపోవాల‌నే రీతిలో వాళ్ల‌ద్ద‌రి మ‌ధ్య లోపాయికారి అవగాహ‌న ఉంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

జ‌నంతో క‌రోనా ఆడే ఆట కంటే …ప్ర‌భుత్వం, ప్రైవేట్ ఆస్ప‌త్రులు అంత‌కు మించి చెల‌గాటం ఆడుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

సొదుం ర‌మ‌ణ‌