కొండంత రాగం తీసి…

వెనుక‌టికెవ‌రో కొండంత రాగం తీసి …ఎందుకూ ప‌నికి రాని పాట పాడిన చందంగా, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాట‌లున్నాయి. ఏపీలో కరోనా విజృంభిస్తేనే ఆయ‌న‌కు మ‌హా ఆనందం. ఎందుకంటే ఈ సాకుతో జ‌గ‌న్ స‌ర్కార్‌పై…

వెనుక‌టికెవ‌రో కొండంత రాగం తీసి …ఎందుకూ ప‌నికి రాని పాట పాడిన చందంగా, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాట‌లున్నాయి. ఏపీలో కరోనా విజృంభిస్తేనే ఆయ‌న‌కు మ‌హా ఆనందం. ఎందుకంటే ఈ సాకుతో జ‌గ‌న్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించి రాజ‌కీయ ల‌బ్ధి పొంద‌వ‌చ్చ‌నేది ఆయ‌న ఆలోచ‌న‌గా క‌నిపిస్తోందని ప్ర‌త్య‌ర్థులు ఆరోప‌స్తున్నారు.

తెదేపా సర్వసభ్య సమావేశాన్ని వర్చువల్‌ విధానంలో చంద్ర‌బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రోజుకు 20 వేలకుపైగా కొవిడ్‌ కేసులు వస్తున్నాయన్నారు. ఎంతో మంది చనిపోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆక్సిజన్‌ లేక పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నార‌ని మ‌న‌సులోని బాధ‌ను బ‌య‌ట పెట్టారు. ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేద‌ని విమ‌ర్శించారు. ఏకంగా 25% పాజిటివిటీ రేటు ఉంద‌న్నారు.  

చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్నీ నిజ‌మే అనుకుందాం. క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా, సుదీర్ఘ కాలం పాటు ఏపీలో అధికారం చెలాయించిన ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన పార్టీ అధినేత‌గా ఆయ‌నేం చెప్పారో తెలుసుకుందాం.

‘కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకోవాలి. పార్టీపరంగా నియోజకవర్గానికి ఓ వైద్యుడు, హోం క్వారంటైన్‌ వ్యవస్థ ద్వారా చికిత్స అందిస్తాం’ అని చంద్రబాబు  పేర్కొన్నారు.

25% పాజిటివిటీ రేటు ఉంద‌ని, రోజుకు 20 వేల‌కు పైగా కొత్త కేసులు వ‌స్తున్నాయ‌ని, అస‌లు బెడ్లే దొర‌క‌డం లేద‌ని తీవ్ర ఆవేద‌న‌, ఆక్రోశం వెళ్ల‌గ‌క్కిన చంద్ర‌బాబు … చివ‌రికి నియోజ‌క వ‌ర్గానికి పార్టీ ప‌రంగా ఒక్క వైద్యుడిని నియ‌మించి, అది కూడా హోంక్వారం టైన్ వ్య‌వ‌స్థ ద్వారా చికిత్స అందిస్తామ‌న‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌జారోగ్యంపై చంద్ర‌బాబుకు నిజంగా ప్రేమాభి మానాలే ఉంటే… ఇంత కంటే ఉన్న‌తంగా వైద్యం అందించ‌లేరా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ సేవ‌ల‌ను బాబుకు గుర్తు చేస్తున్నారు. రాజ‌కీయాలు, అధికారంతో ఏ మాత్రం సంబంధం లేని వ్య‌క్తి విప‌త్తు స‌మ‌యంలో ప్ర‌జ‌కు కొండంత అండ‌గా నిలిచిన వైనాన్ని బాబు తెలుసుకుని, ఇలాంటి స‌మ‌యంలో చేయాల్సిన ప‌నేంటో నేర్చుకోవాల‌ని బాబుకు హిత‌వు చెబుతున్నారు. క‌రోనా త‌ర్వాత రాజ‌కీయాలు చూసుకోవాల‌ని, ఇప్పుడు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు కాదు, సాయం కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

కేవ‌లం జ‌గ‌న్ స‌ర్కార్‌ను విమ‌ర్శించ‌డానికే త‌ప్ప‌, త‌మ వంతుగా ఏదైనా చేద్దామ‌నే ఆలోచ‌న ఒక్క‌శాతం కూడా బాబులో క‌నిపించ‌డం లేద‌న‌డాకి ఆయ‌న మాట‌లే నిదర్శ‌న‌మ‌ని చెప్పొచ్చు. ఈ మాత్రం దానికి మాట‌లు కోట‌లు దాటేలా మాట్లాడ్డం దేనిక‌నే అస‌హనం జ‌నంలో క‌నిపిస్తోంది. పాల‌క‌ప్ర‌తిప‌క్ష పార్టీలు దొందు దొందే అని జ‌నం విమ‌ర్శిస్తున్నారు.

సొదుం ర‌మ‌ణ‌