నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త నాయకుడు ప్రవేశించారు. న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన నరసింహారావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆయన వైసీపీకి మద్దతు పలికారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆళ్లగడ్డలో టీడీపీకి ఒక బలమైన నాయకత్వం అవసరం ఉందని నరసింహారావు భావన.
ఆళ్లగడ్డలో బలిజ సామాజిక వర్గం గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. 2009లో ఇక్కడ పీఆర్పీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి గెలుపొందడం వెనుక చిరంజీవి సామాజిక వర్గమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆళ్లగడ్డలో బలంగా ఉన్న తమ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే కావాలనే ఆకాంక్ష వారిలో ఉంది. దీన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు నరసింహారావు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు.
కొన్ని నెలలుగా ఆయన ఆళ్లగడ్డపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వనభోజనాల పేరుతో బలిజ సామాజిక వర్గంతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ వారి మద్దతు కూడగడుతున్నారు. మరోవైపు అఖిలప్రియ రోజురోజుకూ రాజకీయంగా బలహీనపడుతున్నారు. ఇదే సందర్భంగా భూమా కుటుంబం నుంచి ఆమెకు వరుసకు అన్న అయిన కిషోర్‌రెడ్డి బలపడుతున్నారు. పల్లె నిద్ర పేరుతో నెల నుంచి ఆయన గ్రామీణ ప్రజలతో మమేకం అవుతున్నారు. అఖిలప్రియ మాత్రం అసలు నియోజకవర్గంలోనే ఉండడం లేదు.
నరసింహారావు టీడీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకోవడంతో ఆయన్ను అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ కలుసుకున్నారు. అఖిలప్రియ భర్త కూడా బలిజ అయినప్పటికీ స్థానికేతరుడు, అలాగే ఆర్థికంగా భరోసా ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవడం, వివిధ నేరాల్లో నిందితుడనే ప్రచారం ఉండడంతో జనానికి చేరువ కాలేకపోతున్నారు. అఖిలప్రియపై సర్వే నివేదికలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో ఆళ్లగడ్డలో సరైన అభ్యర్థి కోసం టీడీపీ వెతుకుతోంది. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న భూమా కిషోర్‌పై టీడీపీ సానుకూలంగా వుందనే వార్తలొస్తున్నాయి.
కిషోర్‌కు అఖిలప్రియ ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వరు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో టీడీపీ టికెట్ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఆ నాయకుడిని తానే ఎందుకు కాకూడదని నరసింహారావు తన సామాజిక వర్గం నేతల సమావేశంలో అన్నట్టు సమాచారం. ఆళ్లగడ్డలో ఎప్పుడూ రెడ్ల పెత్తనమేనా? తామేం తక్కువని ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. రాజకీయాల్లో డబ్బు శాసిస్తున్న నేపథ్యంలో నరసింహారావు కోరికను కాదనడానికి మనమెవరం?