మనిషన్న తర్వాత తప్పు చేయకుండా ఎవరూ ఉండరు. కానీ తాను తప్పు చేసినట్టు ఒప్పుకోవడంలోనే ఆ వ్యక్తి సంస్కారం బయటపడుతుంది. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ తానో తప్పు చేసినట్టు బహిరంగంగా వెల్లడించారు.
‘నేను తప్పు చేశాను. అది ఇప్పటికి తెలిసింది’ అని హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ ఆవేదనతో చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా శివకార్తికేయన్‌తో మరో చిత్రంలో యాక్ట్ చేస్తోంది. చాలా గ్యాప్ తర్వాత తెలుగు చిత్రంలో నటిస్తోంది.
అయితే నిన్నమొన్నటి వరకు స్టార్ ఇమేజ్‌తో అవకాశాలను దక్కించుకున్న రకుల్…ప్రస్తుతం కాస్తా అవకాశాలు తగ్గడంతో ఆత్మ పరిశీలన మొదలు పెట్టింది. నటిగా తన కెరీర్‌ను పునఃపరిశీలించుకున్న రకుల్ ప్రీత్‌సింగ్ అవకాశాలు తగ్గిపోవడానికి కారణాలను విశ్లేసించుకున్నట్టుంది. తాను వరుసగా అందాలారబోతకే ప్రాధాన్యతనిచ్చానని, అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైందని…ఈ కారణమే తనకు అవకాశాలను తగ్గించాయంది.
అంతే తప్ప తాను ఏ ఒక్క దర్శకుడికి, నిర్మాతకు భారం కాలేదని తెలిపింది. అలాగే షూటింగ్‌లో ఎవరితోనూ గొడవ పదలేదని చెప్పుకొచ్చింది. సమయానికి షూటింగ్‌కు వెళ్లేదాన్నని, అయినా అవకాశాలు తగ్గిపోయాయంటే ..కేవలం తాను గ్లామరస్‌గా నటించడమే కారణమని చెప్పింది. నటనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం తాను చేసిన తప్పిదమన్నారు. కేవలం గ్లామర్‌కే పరిమితం అయ్యానని, దీని వల్ల అవకాశాలు దూరమయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం రకుల్?