స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. రాష్ట్రంలో మైనార్టీలకు-జగన్ కు మధ్య దూరాన్ని పెంచేందుకు టీడీపీ సహా ఇతర పార్టీలు పన్నిన కుట్రను జగన్ భగ్నం చేశారు. ముస్లింల అనుమానాలు నివృత్తి చేయకుండా ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లను చేపడితే ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని జగన్ స్పష్టం చేశారు. తనను కలవడానికి వచ్చిన ముస్లిం మత పెద్దలు, ముస్లిం ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు కీలక నేతల సమక్షంలో ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు.
2010లో జనాభా లెక్కల సమయంలో అడిగిన ప్రశ్నల కంటే భిన్నంగా ఏ ఒక్క ప్రశ్న ఎక్కువగా ఉన్నా.. ఏపీలో ఎన్పీఆర్, ఎన్ఆర్సీ కష్టమేనని చెప్పారు. ఈ మేరకు కేబినెట్ లో ఆమోదించి, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. అయితే మిగతా రాష్ట్రాల్లాగా గుడ్డిగా ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను తమ రాష్ట్రంలో అమల చేయబోమని వితండవాదం చేయలేదు. వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. జగన్ ఇచ్చిన మాటకి ముస్లిం మత పెద్దలు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ తీర్మానం లేకపోతే రాజీనామా చేస్తామంటూ హెచ్చరించిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా పూర్తిగా శాంతించారు. ఆ విధంగా జగన్ మైనార్టీల పక్షపాతి అని మరోసారి రుజువు చేసుకున్నారు. ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేశారు. అసదుద్దీన్ ని సైతం ఏపీకి తీసుకొచ్చి, జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడించి ఓవర్ యాక్షన్ చేసిన టీడీపీకి ఇది నిజంగా చెంప పేట్టే. ఇప్పటి వరకూ మైనార్టీలను అడ్డు పెట్టుకుని ఆడాలనుకున్న టీడీపీ పొలిటికల్ గేమ్ కి ఎండ్ కార్డు పడినట్టే లెక్క.
అయితే బీజేపీతో సయోధ్య కుదురుతుందనుకుంటున్న వేళ, జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. రాజ్యసభలో ఓ సీటు గెలవడానికి బీజేపీకి సహకారం అందిస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ, జగన్ కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి. కేంద్రం వద్ద సాగిలపడ్డారంటూ వస్తున్న అపవాదులకి కూడా జగన్ తన నిర్ణయంతో చెక్ పెట్టినట్టవుతుంది.