ఎన్నికల తర్వాత పూర్తిగా డీలా పడిన నారాయణకు మరో షాక్. ఏపీలోని నారాయణ, చైతన్య కాలేజీలపై ఆదాయపు పన్ను శాఖ ఈరోజు ఉదయం నుంచి మెరుపు దాడులు చేస్తోంది. విజయవాడ బెంజి సర్కిల్ దగ్గరున్న నారాయణ, చైతన్య కాలేజీల్లో తనిఖీలతో ఈ ఆపరేషన్ మొదలైంది. ఉదయం 8 గంటలకే సంబంధిత కాలేజీలకు చేరుకున్న ఐటీ సిబ్బంది, అందర్నీ బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఐటీ రిటర్న్స్ కు సంబంధించిన అవకతవకలపై డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు.
ఆ వెంటనే తాటిగడప, ఈడ్పుగల్లులోని క్యాంపస్ లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్ లోని మాదాపూర్ బ్రాంచ్ కు చెందిన చైతన్య కాలేజ్ పై కూడా దాడులు జరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని లొకేషన్లలో నారాయణ, చైతన్య కాలేజీలపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు కీలకమైన అన్ని కాలేజీల్లో ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఐటీ రిటర్న్స్ విషయంలో సదరు కాలేజీ యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చినట్టు అధికారులు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు. దీనికితోడు నారాయణ, చైతన్య కాలేజీల మధ్య జరిగిన ఆర్థిక వ్యవహారాల్లో కూడా చాలా అవకతవకలు-అక్రమాలు జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ రెండు కోణాల్లోనే ప్రస్తుతం దాడులు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి డాక్యుమెంట్ ను సీజ్ చేస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే నారాయణను ఐటీ అధికారులు ప్రశ్నించే అవకాశాలున్నాయి.
ఈరోజు నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. ఓవైపు స్టాఫ్ మొత్తం ఆ ఏర్పాట్లలో ఉన్న తరుణంలో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేయడంతో నారాయణ-చైతన్య సిబ్బంది తేరుకోలేకపోయారు. పోలీసుల రక్షణ మధ్య ఐటీ అధికారులు సెడన్ గా కాలేజీ ఆఫీసుల్లోకి రావడంతో ఉన్నఫలంతా ఆఫీసులు వదిలి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
అనుమతి లేకుండా, నిబంధనల్ని ఉల్లంఘించి నడుపుతున్న నారాయణ, చైతన్య బ్రాంచీల్ని తక్షణం సీజ్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఇప్పుడు దీనికి తోడు ఐటీ మెరుపు దాడులు నారాయణను మరింత కలవరపెట్టడం ఖాయం.