ప్రజాకోర్టు అంటే ప్రతిపక్ష టీడీపీకి వణుకు పుడుతోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రధానమైంది. ప్రజల ఆశీస్సులు ఉంటేనే ఎవరైనా ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు…ఎన్నికల రణక్షేత్రమంటే చలి జ్వరం వచ్చిన వారి మాదిరిగా గజగజ వణికిపోతున్నాడు.
తన పాలనలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఆ పని చేయలేదు. తన పాలనపై ప్రజల్లో వ్యతిరేకతను అప్పట్లోనే గుర్తించిన చంద్రబాబునాయుడు…కోర్టు ఆదేశించినా ఏవో సాకులు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టదలతో ఉంది. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం ఎన్నికలంటే చాలు….పరుగో పరుగు అంటున్నాడు.
బీసీ రిజర్వేషన్లపై కావాలనే సొంత పార్టీ నేతలతో కోర్టులో పిటిషన్ వేయించి…కాలయాపన చేసేందుకు సరికొత్త ఎత్తుగడకు బాబు శ్రీకారం చుట్టాడు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఈ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముగించాలని జగన్ సర్కార్ ఉత్సాహంతో ఉంది. కానీ టీడీపీ మాత్రం అందుకు సన్నద్ధంగా లేదు. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుదలతో ఉన్నాడు. బీసీ రిజర్వేషన్లపై మరోసారి సుప్రీంకోర్టు గడప తొక్కడానికి సిద్ధమని ఆయన ప్రకటించాడు. ఎంత సేపూ ఎన్నికల వాయిదాకే చంద్రబాబు మొగ్గు చూపుతున్నాడు.
మరోవైపు సీఎం జగన్ మాత్రం నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని, స్థానిక సంస్థల ఎన్నికలు 14వ ఆర్థిక సంఘం నిధులతో ముడిపడి ఉన్నాయని ఆయన చెప్పాడు. ఈ నిధులు రావాలంటే ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తి కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశాడు. ఈ మేరకు సీఎం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నాడు.
కానీ 14వ ఆర్థిక సంఘం నిధులు ఏమైనా పోనీ, రాష్ట్ర అభివృద్ధితో తమకు సంబంధం లేదన్నట్టు ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే బాబుకు ఎందుకంత భయమో అర్థం కావడం లేదు. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలంటూ నానా యాగీ చేస్తూ వచ్చిన బాబు…తీరా ఎన్నికలనే సరికి పరారే…పరారే అంటూ కోర్టు మెట్లు ఎక్కడం ఏంటో అర్థం కావడం లేదు. ఎన్నికలంటే ఇంకెంత కాలం ఈ భయం.