మహారాష్ట్రలో మొన్నటి వరకూ శివసేనను గట్టిగా విమర్శించిన బీజేపీ టోన్ మారుస్తూ ఉంది. అవసరమైతే తాము శివసేనకు మద్దతును ఇస్తామంటూ కమలం పార్టీ వాళ్లు కన్నుగీటుతూ ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎలాంటి హాట్ హాట్ పొలిటికల్ పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన శివసేన-బీజేపీలు ప్రభుత్వాన్ని మాత్రం సఖ్యతగా ఏర్పాటు చేయలేకపోయాయి. పదవుల కోసం పోటీలు పడి.. కుస్తీ పట్టాయి. ఎన్సీపీ చీలిక వర్గం సపోర్ట్ చేస్తుందంటూ బీజేపీ హడావుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని గంటల్లోనే ఆ ప్రభుత్వం పడిపోవడంతో బీజేపీ అభాసుపాలయ్యింది.
ఆ తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు ఒప్పందానికి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, శివసేనకు కోరిన సీఎం సీటు దక్కడం జరిగింది. అలా ఆ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఈ క్రమంలో అక్కడ ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు అనే అంశం తెర మీదకు వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుకోవాలని బీజేపీ చూస్తున్నట్టుగా ఉంది. ఆ బిల్లు పట్ల శివసేన అంత సానుకూలంగా ఉండకపోవచ్చు.
ఈ నేపథ్యంలో బీజేపీ మరాఠా నేతలు స్పందిస్తూ ఉన్నారు. ఆ బిల్లును సేన అడ్డుకోవాలని, కాంగ్రెస్-ఎన్సీపీలు ఒత్తిడి చేసినా ఆ బిల్లును అడ్డుకోవాలని, ఒకవేళ ఆ పార్టీలు సేన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే బీజేపీ మద్దతును ఇస్తుందని బీజేపీ మహారాష్ట్ర నేత ఒకరు ప్రకటించారు. శివసేన ప్రభుత్వాన్ని బీజేపీ నిలబెడుతుందని ప్రకటించేశారు! ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రేతో తమ సంబంధాలు బాగున్నాయన్నట్టుగా సదరునేత చెప్పుకొచ్చారు. ఇటీవల ప్రధాని మోడీతో ఉద్ధవ్ సమావేశం అయినప్పుడే పలు అనుమానాలు రేగాయి, ఇప్పుడు బీజేపీ వాళ్లు శివసేనతో మళ్లీ కాపురానికి సిద్ధమనే సంకేతాలను బాహాటంగానే ఇస్తున్నారు!