చరిత్ర అంటే మాది, రికార్డులు కూడా మావే అని అధికారంలో ఉన్నన్నాళ్ళూ టీడీపీ నేతలు చెప్పుకుని తిరిగే వారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఆయన చేపడుతున్న అనేక కార్యక్రమలు రికార్డు స్థాయిలోనే ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. నిన్నటికి నిన్న ఆదివారం అని సెలవు రోజు అని కూడా చూడకుండా తెల్లవారకముందే అవ్వా తాతలకు పించన్లు ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చిన వాలంటీర్ల వ్యవస్థను, ఆ భారీ రికార్డుని కూడా వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.
ఇపుడు పాతిక లక్షల ఇళ్ళ పట్టాలను పేదలకు పంచిపెట్టే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేస్తోందని, ఇది జగన్ సాధించిన అతి పెద్ద ప్రపంచ రికార్డు అని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటున్నారు. ఇంతవరకూ పేదలకు భారీ ఎత్తున ఇళ్ళ పట్టాలను పావు కోటికి పైగా లబ్దిదారులకు ఒకేసారి అందించిన చరిత్ర ఏ దేశంలోనూ లేదని ఆయన చెబుతున్నారు.
విశాఖ రాజధానిగా భేష్ అన్న సుభాష్ చంద్రబోస్, రెండు రాజధానులు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయని, టీడీపీ నేతలు మాత్రం అంతా అమరావతిలోనే అంటూ పిడివాదంతో సాగుతున్నారని దుయ్యబెట్టారు. విశాఖ రాజధానిగా తొందరలోనే అధికారికంగా కార్యకలాపాలు సాగుతాయంటున్న మంత్రి గారు చంద్రబాబు మూడు రాజధానుల పైన రచ్చ చేస్తూ కేవలం మూడు గ్రామాల నాయకుడిగా చివరికి మిగిలిపోయారని ఎద్దేవా చేశారు.
మొత్తానికి చూసుకుంటే రికార్డులు అన్నీ మావేనని చెప్పుకున్న టీడీపీ ఇపుడు జగన్ సర్కార్ సాధిస్తున్న అరుదైన రికార్డుల గురించి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందని అంటున్నారు. పైకి డాంబికాలు చేస్తున్నా అసలు విషయం తెలిసిన టీడీపీ నేతలు సైలెంట్ అవుతున్నారు.