మా రోజుల్లో మంచి మంచి బ్రాండ్లు దొరికేవి, ఇప్పుడు మరీ చీప్ బ్రాండ్స్ కి పడిపోయాం. అసలు ఏం జరుగుతోందీ రాష్ట్రంలో. కనీసం మంచి మద్యం కూడా ప్రజలకు అందుబాటులో లేదు. ఇదీ ఇప్పుడు టీడీపీ నేతల ఏడుపు. చంద్రబాబు మొదలుపెట్టిన ఈ ఆందోళనను.. మిగతా నేతలు కంటిన్యూ చేస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు ఎంతలా దిగజారిపోయారంటే.. ప్రెస్ మీట్లో ఏకంగా మందు బాటిళ్లు ముందు పెట్టుకుని ఫోజులిస్తున్నారు.
సినిమాలో కూడా మందు బాటిళ్ల బ్రాండ్లను చూపించడానికి సెన్సార్ ఒప్పుకోదు. అలాంటిది ఏకంగా.. బాధ్యత గల ప్రజా ప్రతినిధులు ప్రెస్ మీట్లో తమ ముందు మద్యం బాటిళ్లను పెట్టుకుని చూపెట్టడాన్ని ఏమనాలి? తాజాగా బొండా ఉమ ప్రెస్ మీట్లో కూడా ఇదే జరిగింది. గతంలో ఈ బ్రాండ్లు దొరికేవి, ఇప్పుడిలాంటి బ్రాండ్లు దొరుకుతున్నాయంటూ బీద అరుపులు అరుస్తున్నారు ఉమ. అసలీ బ్రాండ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకవంటూ ముక్తాయించారు.
సౌతిండియాలోనే ఈ బ్రాండ్లు దొరకవు, నార్తిండియాలో కూడా ఎక్కాడ చూడలేదు, ఆఫ్రికాలో కూడా ఇలాంటి మందు దొరకదని చెప్పారు ఉమ. అసలు టీడీపీ నేతలు అంతలా ఎలా రీసెర్చ్ చేశారు అటు జనాలకి కూడా అర్థం కాలేదు. చీప్ బ్రాండ్లు తాగితే ప్రజల ఆరోగ్యం చెడిపోదంటూ కబుర్లు చెబుతున్న ఉమా లాంటి నేతలు.. నిఖార్సయిన సీమ సరుకు తాగితే.. ఆరోగ్యం బాగుపడుతుందేమో చెప్పాలి.
మందు గురించి టీడీపీ నేతలు చేస్తున్న రాద్ధాంతాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. మందు బాటిళ్లు పక్కన పట్టుకుని మాట్లాడటాన్ని మరీ అసహ్యించుకుంటున్నారు. జిల్లా స్థాయి నేతలే అనుకుంటే.. రాష్ట్ర నేతలు కూడా.. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మందు బాటిళ్లతో ప్రెస్ మీట్లకు వచ్చి జనాలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు.
ఓవైపు ముఖ్యమంత్రి జగన్ దశలవారీగా మద్య నిషేధం కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే.. టీడీపీ నేతలు ఇలా మంచి బ్రాండ్లు తాగండంటూ ప్రజల్ని ఊహించడంలో అర్థం ఏంటి? వీళ్లకు ప్రజల మంచి అక్కర్లేదు. ప్రభుత్వాన్ని తిట్టామా లేదా అనేదే ముఖ్యం. అందులో భాగంగానే వచ్చింది ఈ మందు బాటిళ్ల ప్రెస్ మీట్.