సౌత్ లో హిట్టైన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆసక్తి ఉన్న వారిలో దర్శకుడు రోహిత్ షెట్టి ఒకరు. నిర్మాతగా, దర్శకుడిగా సౌత్ సినిమాల్లో హిట్టైన వాటిని ఏరికోరి హిందీలో చేస్తూ ఉంటాడు. సూర్య సినిమా సింగం ను సింఘం గా, ఎన్టీఆర్ టెంపర్ ను సింబాగా రీమేక్ చేశాడు షెట్టి.
అలా మాస్ మసాలాల రూపకల్పనను కాచి వడపోచాడు ఈ దర్శకుడు. కేవలం రీమేక్ లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సౌత్ మసాలా సినిమాల తరహాలో హిందీలో సొంత సినిమాలు కూడా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సూర్యవంశీ అంటూ అక్షయ్ కుమార్ హీరోగా ఒక సినిమాను రూపొందించాడు. ఆ సినిమాకు సంబంధించి సుదీర్ఘమైన ట్రైలర్ ను కూడా వదిలాడు.
విశేషం ఏమిటంటే.. అది అక్షయ్ కుమార్ సినిమా నే అయినా మరో ఇద్దరు ప్రముఖ హీరోలు కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. వారే అజయ్ దేవగణ్, రణ్ వీర్ సింగ్. అక్షయ్ సినిమాలు వీరిది గెస్ట్ అప్పీరియన్స్ అని తెలుస్తోంది. అయితే వీరు కనిపించే పాత్రలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు ట్రైలర్ లో. అజయ్ దేవగణ్ సింఘం గా, రణ్ వీర్ సింగ్ సింబా గా అక్షయ్ తో పాటు కనిపిస్తున్నారు! సూర్యవంశీ సినిమాలో అక్షయ్ ది పోలీస్ పాత్రే, ఆ పోలిస్ పాత్రకు సాయంగా మరో రెండో పోలిస్ పాత్రలు క్లైమాక్స్ లో రంగంలోకి
దిగుతాయని ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారు.
సింబాలో రణ్ వీర్ పోలిస్ గా ఆకట్టుకున్నాడు. సింఘం లో అజయ్ దేవగన్ సింగంగా కనిపించాడు. ఈ రెండు పోలిస్ పాత్రలనూ వాటి ఆటిట్యూడ్ తోనే సూర్యవంశీలో కొనసాగిస్తూ ఉన్నట్టున్నాడు రోహిత్ షెట్టి. ఇదో కొత్త తరహా ప్రయోగమేమో! వర్కవుట్ అయితే.. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని జరగవచ్చు!